'మన నిర్మాణం అందరూ చర్చించుకునేలా ఉండాలి'
విజయవాడ: రాజధాని పరిధిలోని సీడ్ క్యాపిటల్ ను కలుపుతూ సీడ్ యాక్సెస్ రోడ్డు, నమునా నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమోదం తెలిపారు. రాయపూడి నుంచి ప్రారంభమై కనకదుర్గమ్మ వారధి వరకు 21.5 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం ఉండనుంది. మెట్రో, బీఆర్ టీఎస్ తో కలిసి నాలుగు లైన్ల రహదారిగా దీన్ని నిర్మించనున్నారు. బుధవారం సాయంత్రం సీఎం చంద్రబాబు సీఎంవోలో సీఆర్ డీఏ అధికారులతో సమావేశమయ్యారు.
ఈ రోడ్డు నిర్మాణంలో భాగంగా 1.5 కిలోమీటర్ల పొడవు ఆరు లైన్ల ఫ్లై ఓవర్ నిర్మాణం జరగనుంది. మొదటి దశలో రూ.250కోట్ల వ్యవయంతో 18.3 కి.మీమేరకు రహదారి నిర్మాణానికి టెండర్లు పిలవడానికి సీఎం అనుమతించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు నిర్మాణం ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేలా ఉండాలని అన్నారు. చుట్టూ ఉన్న ఆరు జాతీయ రహదారులతో అమరావతిని అనుసంధానం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పీ నారాయాణ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.