కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ జాయింట్ సెక్రటరీ దీపక్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: రేషన్ బియ్యం అక్రమ రవాణా అరికట్టడానికి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఏర్పాటు చేసిన ‘కమాండ్ కంట్రోల్ సెంటర్’కు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ జాయింట్ సెక్రటరీ దీపక్‌కుమార్ కితాబిచ్చారు. ఒక రోజు పర్యటనలో భాగంగా మంగళవారం కమాండ్ సెంటర్‌ను పరిశీలించిన దీపక్ కుమార్.. గోదాముల నుంచి రేషన్ షాపుల వరకు సరుకులు చేరే కదలికలను ఈ కేంద్రం నుంచి పర్యవేక్షించేలా ఏర్పాటు చేయడం బాగుందన్నారు. మండల స్థాయి నిల్వ కేంద్రాల (ఎంఎల్‌ఎస్ పాయింట్లు) వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు, సరుకులు తరలించే లారీలకు జీపీఎస్ అనుసంధానం విధానాలు అనుసరణీయమని, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సిఫార్సు చేస్తానని చెప్పారు.
రేషన్ సరుకులు లబ్ధిదారుడికి చేరే వరకు అడుగడుగునా నిఘా ఉంచేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశామని పౌరసరఫరాల శాఖ కమిషనర్ సి.వి.ఆనంద్ వివరించారు. కాకినాడ పోర్టు ద్వారా అక్రమంగా బియ్యం తరలింపును ఈ సెంటర్ ద్వారా నిరోధించగలిగామని చెప్పారు. తెలంగాణలో ఈ–పాస్ విధానం అమలు ఎంతవరకు వచ్చిందని అధికారులను దీపక్‌కుమార్ అడిగి తెలుసుకున్నారు. నగదు రహిత లావాదేవీల దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ షాపుల్లో ఈ–పాస్ మిషన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కాగా, జూన్ నాటికి ప్రక్రియను పూర్తి చేస్తామని కమిషనర్ ఆనంద్ చెప్పారు. గత ఖరీఫ్‌లో 4 లక్షల మంది రైతుల నుంచి 16.45 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆన్‌లైన్ ద్వారా రూ.2,500 కోట్లు చెల్లింపులు జరిపామన్నారు. సమావేశంలో సీఆర్‌ఓ బాలమయదేవి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
‘కమాండ్ కంట్రోల్’.. అనుసరణీయం
Published Wed, Apr 26 2017 2:22 AM | Last Updated on Tue, Sep 5 2017 9:40 AM
Advertisement