మీరు తేల్చండి.. మేం ఖరారు చేస్తాం! | Committee visit again in the state | Sakshi
Sakshi News home page

మీరు తేల్చండి.. మేం ఖరారు చేస్తాం!

Published Wed, Feb 22 2017 3:11 AM | Last Updated on Wed, Aug 29 2018 9:29 PM

Committee visit again in the state

పోలవరం, పట్టిసీమల్లో నీటి వాటాపై బజాజ్‌ కమిటీకి కేంద్రం స్పష్టత?
తెలంగాణ ఒత్తిడి మేరకు నిర్ణయం
మరోమారు రాష్ట్రంలో పర్యటించనున్న కమిటీ


సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా జలాల వివాద పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఏకే బజాజ్‌ కమిటీ పరిధిపై స్పష్టత నిస్తూ కేంద్ర జల వనరుల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరం, పట్టిసీమల ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు తరలించే నీటిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు దక్కే నీటి వాటాలను తేల్చాలని కమిటీకి సూచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే కమిటీ తాత్కాలిక కేటాయింపులపై ప్రతిపాదన మాత్రమే చేయాలని.. వాటిని తామే ఖరారు చేస్తామని కేంద్ర జల వనరుల శాఖ పేర్కొన్నట్లు తెలిసింది.

రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్‌ మేరకు..
పోలవరం, పట్టిసీమల ద్వారా కృష్ణాకు తరలిస్తున్న నీటివాటాలు తాము తేల్చలేమని, తమ పని కేవలం విధావిధానాలకే పరిమితమని ఇటీవలి రాష్ట్ర పర్యటన సందర్భంగా ఏకే బజాజ్‌ కమిటీ పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై అప్పుడే తెలంగాణ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. వాటాల అంశం తేల్చి, కేటాయింపులు చేసేందుకు బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌కు చాలా సమయం పట్టే అవకాశ మున్నందున... ఆలోగా తాత్కాలిక కేటాయింపులు చేయాల్సిన బాధ్యత కమిటీపై ఉందని స్పష్టం చేసింది. పట్టిసీమ, పోలవరం ల ద్వారా ఎగువ రాష్ట్రాలకు 98 టీఎంసీలు దక్కాల్సి ఉందని.. అందులో తెలంగాణకు పోలవరం ద్వారా 43 టీఎంసీ లు, పట్టిసీమ ద్వారా 35 టీఎంసీలు కలిపి 78 టీఎంసీలు రావాలని.. మరి కమిటీ ఏ మేరకు నీటి వాటా ఇస్తుందో నిర్దిష్టంగా చెప్పాలని డిమాండ్‌ చేసింది.

ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆర్‌.విద్యాసా గర్‌రావు కేంద్ర జల వనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి అమర్‌జీత్‌సింగ్‌ను కలసి వివరించారు. ఈ అంశంలో వాటాలు తేల్చి, తాత్కాలిక కేటాయింపులు చేసేలా కమిటీకి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలోనే కమిటీ చైర్మన్‌ ఏకే బజాజ్, సభ్య కార్యదర్శి ఎన్‌ఎన్‌ రాయ్‌లను అమర్‌ జీత్‌సింగ్‌ పిలిపించుకుని మాట్లాడినట్లు తెలిసింది. బచావత్‌ అవార్డు మేరకు రెండు ప్రాజెక్టుల నిర్మాణంతో తెలుగు రాష్ట్రాలకు దక్కే వాటాలను తేల్చాలని.. దాన్ని ఖరారు చేసే బాధ్యత తాము తీసుకుంటామని ఆదేశిం చినట్లు తెలిసింది. దీంతో ఏకే బజాజ్‌ కమిటీ మరో పది రోజుల్లోనే రాష్ట్ర పర్యటన చేయాల ని నిర్ణయించినట్లు తెలిసింది. ఆ పర్యటనలో వాటాల అంశంపై మరింత లోతుగా అధ్యయ నం చేయాలని, ప్రాజెక్టుల పర్యటన చేపట్టాల ని భావిస్తున్నట్లు సమాచారం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement