గులాబీ నేతల్లో ‘ఆకర్ష్’ గుబులు!
♦ టీఆర్‌ఎస్‌లో కిక్కిరిసిపోతున్న కొత్త నేతలు
♦ ఈ చేరికలతో ఎవరికి ఎసరు వస్తుందోననే ఆందోళన
సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్‌ఎస్ నేతల్లో గుబులు మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ఇతర పార్టీల నుంచి వచ్చి చేరుతున్న నేతలతో గులాబీ పార్టీ కిక్కిరిసిపోతుండడం వారిని కలవరానికి గురిచేస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా టీఆర్‌ఎస్ బాట పడుతున్నారన్న వార్తలతో మరింతగా బెంబేలు పెట్టిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి ఎవరికి ఎసరు వస్తుందోనన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఆయా పార్టీల నుంచి వచ్చి చేరిన వారితో తమకు అవకాశాలు తగ్గిపోయాయన్న అభిప్రాయంలో టీఆర్‌ఎస్ నేతలు ఉన్నారు.
టీటీడీఎల్పీ, వైఎస్సార్‌సీపీ ఎల్పీలను విలీనం చేసుకున్న టీఆర్‌ఎస్ దాదాపు అన్ని పార్టీల నుంచి వివిధ స్థాయిల నేతలను చేర్చుకుంది. తాజాగా కాంగ్రెస్ నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి చేరిక దాదాపు ఖాయం కాగా.. మాజీ ఎంపీ వివేక్, ఆయన సోదరుడు వినోద్ కూడా గులాబీ గడప తొక్కనున్నారన్న ప్రచారం జరుగుతోంది. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, మాజీ స్పీకర్ ఆర్.సురేశ్‌రెడ్డిల పేర్లూ ప్రచారంలో ఉన్నాయి.
నియోజకవర్గాల్లో గందరగోళం..
వివిధ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ పాత, కొత్త నేతల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. పార్టీ ఎమ్మెల్యేలు లేని చోట విపక్ష ఎమ్మెల్యేలను, పార్టీ ఎమ్మెల్యేలున్న కొన్ని నియోజకవర్గాల్లో ఇతర పార్టీల సీనియర్లను చేర్చుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా ముథోల్ ఎమ్మెల్యే గడ్డం విఠల్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనకు, అక్కడ ఓటమి పాలైన టీఆర్‌ఎస్ నేత వేణుగోపాలాచారి వర్గాల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. వరంగల్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రెడ్యానాయక్ గులాబీ కండువా కప్పుకోగా...
ఆయన వర్గానికి, అక్కడ ఓటమి పాలైన సత్యవతి రాథోడ్ వర్గానికి పొసగడం లేదనే వార్తలు వస్తున్నాయి. ఒక్క ఖమ్మం జిల్లా మినహా చేరికలు జరిగిన మెజారిటీ నియోజకవర్గాల్లో ఇదే తరహా పరిణామాలు జరుగుతున్నాయని నేతలు పేర్కొంటున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలో పార్టీ ఎమ్మెల్యే ఉన్నా అక్కడ టీడీపీ సీనియర్ నేత రాములును టీఆర్‌ఎస్‌లోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఎమ్మెల్యే యాద య్యకు, అక్కడ ఓటమి పాలైన రత్నంకు మధ్య సయోధ్య కుదరనే లేదు. మాజీ ఎంపీ వివేక్ గులాబీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమైతే.. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ రాజకీయం రసకందాయకంగా మారినట్లేనని నేతలు అంటున్నారు.
రాజకీయ భవిష్యత్‌పై బెంగ
టీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్న వారు సైతం తమ రాజకీయ భవిష్యత్‌పై బెంగతో ఉన్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందని, ఏ నాయకులను చేర్చుకున్నా ఇబ్బంది ఉండదని అధికార పార్టీ నేతలు చెబుతూ వస్తున్నారు. కానీ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం ఇప్పటిదాకా ఎలాంటి స్పష్టతా ఇవ్వని నేపథ్యంలో ఆందోళన వ్యక్తమవుతోంది.