దొంగతో దోస్తీ | conistable konduru mohan arrested for snatching in hyderabad | Sakshi
Sakshi News home page

దొంగతో దోస్తీ

Published Fri, Nov 20 2015 8:33 AM | Last Updated on Tue, Mar 19 2019 9:03 PM

conistable konduru mohan arrested for snatching in hyderabad

ఇద్దరు స్నాచర్లలతో జతకట్టిన కానిస్టేబుల్
ముగ్గురినీ అరెస్టు చేసిన పోలీసులు
మరో కేసులో ఇరానీ ముఠా సభ్యుడి పట్టివేత
చందానగర్‌లో మరో చైన్ స్నాచర్ అరెస్టు
మొత్తం 1.14 కేజీల బంగారు నగలు స్వాధీనం

సాక్షి, సిటీబ్యూరో:
దుండిగల్ బహుదూర్‌పల్లికి చెందిన కొండూర్ మోహన్ హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లోని నారాయణగూడ ఠాణాలో   కానిస్టేబుల్.. ప్రస్తుతంగచ్చిబౌలిలోని మణికొండలో ఉంటున్నాడు. 2005 బ్యాచ్‌కు చెందిన ఇతను చైన్‌స్నాచర్లు బోరబండకు చెందిన మహమ్మద్ అహ్మద్ (బోరబండ), మహమ్మద్ ఫరూఖ్ (మాదన్నపేట)లను చేరదీశాడు. పోలీసులు పట్టుకుని ఠాణాకు తీసుకొచ్చే బైక్‌లను వారికి సమకూర్చి గొలుసు చోరీలు చేయించేవాడు. వచ్చిన డబ్బులో సగానికిపైగా తీసుకునేవాడు. 

అహ్మద్, ఫరూఖ్‌లను మల్కాజిగిరి పోలీసులు అరెస్టు చేసి విచారించగా  2015 జూన్ నుంచి సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఐదు చైన్ స్నాచింగ్‌లు చేశారని, వీరికి నారాయణగూడ ఠాణా పోలీసు కానిస్టేబుల్ కె.మోహన్ సహకరించాడని వెలుగులోకి వచ్చింది. గురువారం సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, జాయింట్ సీపీ శశిధర్ రెడ్డి, క్రైమ్స్ ఓఎస్‌డీ నవీన్ కుమార్, బాలానగర్ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి తెలిపిన వివరాల ప్రకారం...  
 
కస్టడీలోనే కలిశారు...
గతేడాది జూన్‌లో ఓ ఇంటి చోరీ కేసులో సంతోష్ నాయక్ ముఠాను నారాయణగూడ పోలీసులు అరెస్టు చేశారు. అందులో ఫరూఖ్ కూడా ఉన్నాడు. అప్పుడు కస్టడీలో ఉన్న ఫరూఖ్‌కు కానిస్టేబుల్ మోహన్ సన్నిహితుడయ్యాడు. జైల్లో ఉన్న ఫరూఖ్‌ను ములాఖత్ పేరుతో కలిశాడు. సొంత ఖర్చులతో బెయిల్ కూడా ఇప్పించాడు. ఆ తర్వాత బెయిల్ కోసం తాను చేసిన ఖర్చు తిరిగి ఇచ్చేందుకోసం చోరీలు చేయాలని మోహన్ ఫరూఖ్‌ను ప్రేరేపించాడు. అయితే జైల్లో ఉన్న తన స్నేహితుడు అహ్మద్‌ను కూడా బెయిల్‌పై బయటకు తీసుకొస్తే తాను చోరీలు చేయగలని ఫరూఖ్ స్పష్టం చేశాడు. దీంతో  మోహన్ అహ్మద్‌ను ములాఖత్‌లో కలిసి అతడిని కూడా బెయిల్‌పై బయటకు తీసుకొచ్చాడు.
 
బైక్.. నోకియా ఫోన్ ఇచ్చాడు...
నారాయణగూడ పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాల్లో ఉన్న ఓ సీబీజెడ్ బైక్‌తో పాటు సిమ్ కార్డు వేసి నోకియా ఫోన్‌ను ఫరూఖ్, అహ్మద్‌లకు ఇచ్చాడు. ఆ బైక్‌పై తిరుగుతూ ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటివరకు ఇద్దరూ మల్కాజిగిరి పోలీసు స్టేషన్ పరిధిలో మూడు స్నాచింగ్‌లు, నాచారం, మేడిపల్లి ఠాణా పరిధిల్లో రెండు స్నాచింగ్‌లు చేశారు. దొంగిలించిన సొత్తును మోహన్‌తో కలిసి పంచుకునేవారు.
 
పట్టించిన బైక్...
మల్కాజిగిరి ఠాణా పరిధిలోని ఆనంద్‌బాగ్ ప్రాంతంలో  ఫరూఖ్, అహ్మద్‌లు బైక్‌పై అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు పట్టుకున్నారు. తమదైన శైలిలో విచారించగా గొలుసు చోరీలు చేస్తున్నట్టు ఒప్పుకున్నారు. ఈ బైక్ ఎక్కడిది అని ఆరా తీయగా నారాయణగూడ పోలీసుస్టేషన్ కానిస్టేబుల్ మోహన్ సమకూర్చాడని వెల్లడించారు. దీంతో నగర సీపీ మహేందర్‌రెడ్డికి సమాచారమిచ్చి మోహన్‌ను మల్కాజిగిరి పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి పది తులాల బంగారంతో పాటు సీబీజెడ్ బైక్, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
 
బియ్యం వ్యాపారి గొలుసు దొంగే...
బియ్యం వ్యాపారం చేస్తున్న చందనగర్ పాపిరెడ్డి కాలనీకి చెందిన దొమ్మట రాంప్రసాద్‌ను సీసీఎస్ కూకట్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు. జంట పోలీసు కమిషనరేట్లతో పాటు మెదక్‌లో 19 చైన్ స్నాచింగ్ కేసుల్లో నిందితుడిగా ఉన్న రాంప్రసాద్ నుంచి 60 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.  
 
ఇరానీ ముఠా సభ్యుడి అరెస్టు...
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ శ్రీరాంపూర్ పట్టణానికి చెందిన వాషీమ్ ఉస్మాన్ సయ్యద్‌ను సీసీఎస్ మల్కాజిగిరి పోలీసులు అరెస్టు చేశారు. అతడిని విచారించగా తన సహచరుడు హైదర్ గరీబ్‌షా ఇరానీతో కలిసి 22 చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డానని ఒప్పుకున్నాడు. పుణే, షిర్డీ, అహ్మద్‌నగర్, నాసిక్, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లోనూ గొలుసు చోరీలు చేశామని అంగీకరించాడు. ఇతడి నుంచి 43.5 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నాం.  
 
ఐదంచెల ప్రణాళికతో చైన్ స్నాచింగ్‌కు చెక్....
ఐదుగురు చైన్‌స్నాచర్లను పట్టుకోవడంతో 46 కేసులు పరిష్కారమయ్యాయి. 1.14 కేజీల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నాం. చైన్ స్నాచింగ్‌లను అరికట్టేందుకు ఐదంచెల ప్రణాళికను అమలు చేస్తున్నాం. గతేడాదితో పోల్చుకుంటే గొలుసు చోరీలు సగం తగ్గినా...తీవ్రత పెరగడంతో ప్రజల్లో,. మీడియాలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంటర్ స్టేట్ గ్యాంగ్‌లను పట్టుకునేందుకు ఏడు బృందాలు బయటనే పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు మూడు టీమ్‌లు సత్ఫలితాలనిచ్చాయి. ఇంటర్‌స్టేట్ గ్యాంగ్‌ల డాటా బేస్ రెడీ చేస్తున్నాం. లోకల్ నేరగాళ్ల వివరాల కోసం సర్వే ప్రారంభించబోతున్నాం. ఇవన్నీ సేకరించాక నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోని నిందితుల వివరాలతో కలిపి డాటాబేస్ రెడీ చేస్తాం. చైన్ స్నాచర్లపై 392 దోపిడీ కేసు పెడుతున్నాం. ఇప్పటివరకు 49 మందిపై పీడీ యాక్ట్ పెట్టాం. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూట్ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఛేజింగ్ అండ్ క్యాచింగ్ టీమ్స్ చక్కగా పనిచేస్తున్నాయి.
 - సీవీ ఆనంద్ , సైబరాబాద్ పోలీసు కమిషనర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement