శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భార్యాభర్తల మధ్యన తలెత్తిన గొడవ...కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది.
హైదరాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భార్యాభర్తల మధ్యన తలెత్తిన గొడవ...కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. ఆర్జీఐఏ సీఐ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం శంషాబాద్కు చెందిన ఓ వ్యాపారి ఈనెల 15న వ్యాపార నిమిత్తం ముంబయి వెళ్తున్నట్లు కుటుంబీకులకు చెప్పి వెళ్లాడు. నిన్న సాయంత్ర అతడు గోవా నుంచి వచ్చాడు. విమానాశ్రయంలో అప్పటికే భర్త కోసం ఎదురు చూస్తున్న అతని భార్య.... అక్కడే భర్తతో గొడవ పడింది. అదే సమయంలో కారు చెడిపోవటంతో ఆ వ్యాపారి తన స్నేహితుడు, 'కుర్కురే' సినిమా హీరో ఇంద్రసేనను విమానాశ్రయానికి పిలిపించుకున్నాడు.
అయితే భార్య ...కారు ఎక్కేందుకు నిరాకరించటంతో బలవంతంగా ఆ వ్యాపారి ఎక్కించాడు. ఈ దృశ్యాన్ని చూసిన కొందరు మహిళను కిడ్నాప్ చేస్తున్నట్లుగా అనుమానించి పోలీసులకు ఫోన్ చేశారు. దీంతో అప్రమత్తమైన ఆర్జీఐఏ పోలీసులు...రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. అత్తాపూర్ వద్ద వీరి వాహనాన్ని పోలీసులు ఆపారు. తమ మధ్య జరిగిన చిన్న గొడవ మాత్రమే అని దంపతులు వివరణ ఇవ్వటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.