
సీఆర్‌డీఏ వర్సెస్ ట్రాన్స్‌కో
కాంట్రాక్టుల కోసం పవర్ వార్
టెండర్లు పిలిచే విషయంలో పోటాపోటీ
సీఎం వద్దకు పంచాయితీ
రాజీ కోసం అజయ్‌జైన్ రంగ ప్రవేశం
సాక్షి, హైదరాబాద్: రాజధాని అమరావతి పరిధిలో ప్రతిపాదిత విద్యుత్ ప్రాజెక్టుల వ్యవహారం రెండు ప్రభుత్వ శాఖల మధ్య వివాదాస్పదమైంది. రాజధాని ప్రాధికార అభివృద్ధి సంస్థ (సీఈఆర్‌డీఏ), ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ కంపెనీల మధ్య కాంట్రాక్టుల విషయంలో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. అన్నీ తమ పరిధిలోకే వస్తాయని సీఆర్‌డీఏ చెబుతుంటే, విద్యుత్ విషయంలో వాళ్ళకేం సంబంధమని ట్రాన్స్‌కో వాదిస్తోంది. ఈ పంచాయితీ చివరకు ముఖ్యమంత్రి వరకూ వెళ్ళడం విశేషం. రెండు శాఖల మధ్య రాజీ కుదిర్చే బాధ్యతను ఇంధన కార్యదర్శి అజయ్ జైన్‌కు అప్పగించినట్టు తెలిసింది.
అమరావతిలో 2019 నాటికి 5 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంటుందని సింగపూర్ కంపెనీలు అంచనా వేశాయి. ఏపీ విద్యుత్ సంస్థలు మాత్రం మూడు వేల మెగావాట్లే ఎక్కువని చెబుతున్నారు. ఈ వివాదం అలా ఉంటే... తొలి దశలో 1500 మెగావాట్ల మేర విద్యుత్‌ను అందుబాటులోకి తేవడానికి కొన్ని ప్రాజెక్టులను ప్రతిపాదించారు. రాజధాని వలయం చుట్టూ భూగర్భ కేబుల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలను దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్), ఏపీ ట్రాన్స్‌కో రూపొందించాయి. సీఆర్‌డీఏ అనుమతి ఇస్తే ప్రాజెక్టులకు టెండర్లు పిలవాలని విద్యుత్ సంస్థలు భావించాయి. ఈ మేరకు సీఆర్‌డీఏకు లేఖ కూడా రాశాయి. అయితే సీఆర్‌డీఏ పరిధిలోని ప్రతీ టెండర్‌పైన తమకే పిలిచే హక్కుందని సీఆర్‌డీఏ అంటోంది. విద్యుత్ లైన్లు వేయడం, ట్రాన్స్‌ఫార్మర్లు, భూగర్భ కేబుల్ వేయడం, వాటి నిర్వహణ సీఆర్‌డీఏకి ఏం తెలుసు? అని ట్రాన్స్‌కో వాదిస్తోంది.
భవిష్యత్‌లోనూ విద్యుత్ లైన్ల నిర్వహణను చూసేది ట్రాన్స్‌కో కాబట్టి టెండర్లు ఎవరికి ఇవ్వాలనే దానిపై తమకే అధికారం ఉండాలంటోంది. ఆరంభంలోనే రెండు శాఖలు వీధికెక్కడం వెనుక స్వప్రయోజనాలున్నాయనే విమర్శలొస్తున్నాయి. దాదాపు రూ. 1500 కోట్ల కాంట్రాక్టులను దక్కించుకునేందుకు ఇప్పటికే ట్రాన్స్‌కో అధికారులతో ఓ కంపెనీ లోపాయికారి ఒప్పందాలు చేసుకుందని తెలిసింది. అదే విధంగా మరో కంపెనీ సీఆర్‌డీఏ అధికారులతో లాలూచీ వ్యవహారం నడుపుతోందనే ఆరోపణలున్నాయి. ఈ కారణంగానే పరస్పరం వాదులాడుకుంటున్నారని ట్రాన్స్‌కో వర్గాల సమాచారం.