
సాక్షి, హైదరాబాద్: పంట ఉత్పత్తుల సేకరణ బాధ్యత నుంచి కేంద్రం తప్పుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. వరి, పత్తి మినహా కంది, పెసర, సోయాబీన్, మొక్కజొన్న తదితర ఉత్పత్తులను రాష్ట్రాలే కొనుగోలు చేసేలా కొత్త పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టనుంది.
దీంతో బీజేపీయేతర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. తెలంగాణ ప్రభుత్వం కూడా కొత్త పథకంపై విభేదిస్తూ పలు సూచనలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయశాఖ కేంద్రానికి లేఖ రాయాలని భావిస్తోంది. సేకరణ నుంచి కేంద్రం తప్పుకుంటే దాని ప్రభావం రాష్ట్రాలపై పడుతుందని, రైతులు ఇబ్బంది పడే అవకాశముందని వ్యవసాయాధికారులు అంటున్నారు.
పథకం ఉద్దేశమేంటంటే...
కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) కూడా లభించక నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు ఓ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. వచ్చే బడ్జెట్‌లో దీన్ని వెల్లడించే అవకాశముంది. ఎఫ్‌సీఐ లేదా ఇతర సంస్థల ద్వారా వరి, గోధుమ ఉత్పత్తులను మాత్రమే మద్దతు ధరకు కొనుగోలు చేసే విధానముంది. అయితే, సోయాబీన్, కంది, మినుము, పెసర, వేరుశెనగ, నువ్వులు, మొక్కజొన్న తదితర పంటలకు మద్దతుధర అమలు కావడంలేదు.
ఆయా రాష్ట్రాల్లో పంటల దిగుబడిలో 30 శాతం వరకు మాత్రమే కేంద్రం కొనుగోలు చేస్తుంది. ఇది సరికాదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. కేంద్ర ఆధ్వర్యంలోని మార్క్‌ఫెడ్, ఆయిల్‌ఫెడ్ తదితర సంస్థలే మద్దతుధరకు కొనుగోలు చేస్తున్నాయి. విక్రయించేటప్పుడు ఆ సంస్థలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతోంది. ఆ నష్టంలో కేవలం 40 శాతమే భరిస్తానని కేంద్రం చెబుతుండగా దానిని 55 శాతానికి పెంచాలని తెలంగాణ కోరుతోంది. పంట ఉత్పత్తుల సేకరణకు అవసరమైన నిధులను కేంద్రం సమకూర్చాలని తెలంగాణ సూచిస్తోంది. కనీసం 50 శాతం రివాల్వింగ్ ఫండ్ సమకూర్చాలని విన్నవిస్తోంది.
55 శాతం భరించాలి: పార్థసారథి, కార్యదర్శి, వ్యవసాయశాఖ
పంట ఉత్పత్తుల కొనుగోళ్లలో రాష్ట్రాల్లోని ఆయా సంస్థలకు నష్టం వాటిల్లితే 40 శాతమే భరిస్తానని కొత్త పథకంలో కేంద్రం చెబుతోంది. దాన్ని 55 శాతానికి పెంచాలని కోరుతున్నాం. 50 శాతం రివాల్వింగ్ ఫండ్ ఇవ్వాలని, కేంద్ర సంస్థలు, నాఫెడ్ చేదోడు వాదోడుగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment