
మార్చి చివరికి పోస్టాఫీసుల్లో పాస్‌పోర్టు సేవలు
హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి విష్ణువర్ధన్‌రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ, ఏపీలో మార్చి చివరి నాటికి నాలుగు పోస్టాఫీసుల్లో పాస్‌పోర్ట్ సేవలు ప్రారంభించనున్నామని హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్ బేగంపేట్ పాస్‌పోర్టు సేవా కేంద్రంలో జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన మేళాను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వరంగల్, మహబూబ్‌నగర్.. ఏపీలోని కర్నూలు, కడపలోని పోస్టాఫీసుల్లో పాస్‌పోర్ట్ సేవలు ప్రారంభిస్తున్నామని చెప్పారు.
పాస్‌పోర్టు అనేది ప్రతి పౌరుడి హక్కని.. అది విదేశాల్లో ఉన్నత విద్య పొందేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. డిసెంబర్ నెల నుంచి పాస్‌పోర్ట్ పొందడం సులభతరం చేయడంతో 30 శాతం దరఖాస్తులు పెరిగాయని వివరించారు. జర్నలిస్టుల కోసం అవసరమైతే ఇలాంటి మేళాలు మరిన్ని చేపడతామని విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రాజమౌళి చారి మాట్లాడుతూ.. జర్నలిస్టుల కోసం ప్రత్యేక మేళా ఏర్పాటుచేసి పాస్‌పోర్ట్ సేవలు అందించడం హర్షదాయకం అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కార్యదర్శి విజయ్‌కుమార్‌రెడ్డి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అదనపు డైరెక్టర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సుమారు 720 మంది జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.