దిగ్విజయ్ పర్యటన రద్దు!
- అత్యవసర పనులతో తెలంగాణ పర్యటనను రద్దుచేసుకున్నకాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి
- అగ్రనేత రాక వాయిదాతో కాగ్రెస్ లోకి జగ్గారెడ్డి చేరిక ఆలస్యం!
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలుగు రాష్ట్రాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ తెలంగాణ పర్యటన రద్దయినట్లు తెలిసింది. సోమవారం ఉదయం హైదరాబాద్ చేరుకోవాల్సిన ఆయన అత్యవసర పనుల నిమిత్తం రాలేకపోతున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. అయితే ఆయన తదుపరి పర్యటన ఎప్పుడు ఉంటుందనే విషయంపై కాంగ్రెస్ వర్గాలు సమాచారం ఇవ్వలేదు.
కాగా, డిగ్గీ పర్యటన రద్దుతో మెదక్ జిల్లా నాయకుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి చేరిక సందిగ్ధంలో పడింది. కాంగ్రెస్లోకి తిరిగి చేరనున్న సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసుకున్న జగ్గారెడ్డి ఇప్పుడు ఏం చేస్తారనేది ప్రశ్నగా మారింది.
డిగ్గీ లేకుండానే టీపీసీసీ అగ్ర నాయకుల సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకుంటారా, దిగ్విజయ్ తదుపరి పర్యటన వరకు వేచిచూస్తారా లేక డైరెక్ట్ గా ఢిల్లీకి వెళ్లి అక్కడే పార్టీలో చేరతారా అనే విషయాలపై ఇంకా క్లారిటీ రాలేదు.
ఎమ్మెల్సీగా బరిలోకి..!
త్వరలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో జగ్గారెడ్డి కాంగ్రెస్‌లో చేరటం ప్రాధాన్యం సంతరించుకుంది. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల బలం ఉన్నా... ఎక్కువ మంది ఎంపీటీసీ, జెడ్పీటీసీలు టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిపోయారు. ఇప్పటికిప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే కాంగ్రెస్ నుంచి పోటీకి అభ్యర్థులెవరూ ముందుకు రాని పరిస్థితి ఉంది. ఈ నేపధ్యంలో జగ్గారెడ్డిని బరిలోకి దింపితే పరిస్థితి కొంత ఆశాజనకంగా ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.