హామీలు అటకెక్కిస్తున్న మోదీ, కేసీఆర్
► దిగ్విజయ్‌సింగ్ ధ్వజం
► 14 నుంచి 16 వరకుగ్రేటర్ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా 18న మేనిఫెస్టో ప్రకటన
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అటకెక్కించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీపడుతున్నారని ఏఐసీసీ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ విమర్శించారు. ఏఐసీసీ కార్యదర్శి ఆర్.సి.కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీనేత కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, ఎంపీ వి.హనుమంతరావులతో కలసి ఆయన బుధవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే నల్లధనాన్ని వెనక్కి తెప్పిస్తానని ప్రధాని మోదీ యూ టర్న్ తీసుకున్నారని దిగ్విజయ్ దుయ్యబట్టారు. తెలంగాణ ఇస్తే పార్టీని విలీనం చేస్తానంటూ సోనియాగాంధీ ఇంటివద్ద వడిగాపులు కాసిన కేసీఆర్ ఆ తరువాత యూటర్న్ తీసుకున్నారని ఎద్దేవా చేశారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన కేసీఆర్ ఈ 19 నెలల్లో కనీసం ప్రతిపాదనలను కూడా సిద్దంచేయలేదన్నారు.
దళితులకు మూడెకరాల భూమి, కేజీ టు పీజీ ఉచిత విద్య వంటివాటిపై సీఎం కేసీఆర్ చెప్పిన మాటలేవీ అమలుచేయలేదని విమర్శించారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ భారీ అవినీతికి పాల్పడ్డారని దిగ్విజయ్‌సింగ్ ఆరోపించారు. నితిన్ గడ్కారీ కుమారుడు నిఖిల్ గడ్కారీ డెరైక్టరుగా ఉన్న కంపెనీకి 10 వేలకోట్ల కాంట్రాక్టును నిబంధనలకు వ్యతిరేకంగా కట్టబెట్టారని ఆరోపించారు.
గ్రేటర్‌లో అన్ని సీట్లకూ పోటీ
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అన్ని సీట్లకూ పోటీచేస్తామని దిగ్విజయ్‌సింగ్ చెప్పారు. ఈ నెల 18న పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటిస్తామన్నారు. దిగ్విజయ్ ఆధ్వర్యంలో బుధవారం పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. పార్టీ ముఖ్యనేతలు కె.జానారెడ్డి, షబ్బీర్‌అలీ, శ్రీధర్‌బాబు, పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ నెల 14 నుంచి 16 దాకా పార్టీ అభ్యర్థుల జాబితాలను ప్రకటిస్తామని దిగ్విజయ్ చెప్పారు.