వేల కోట్లు మింగుతోంది
• కేసీఆర్ కుటుంబంపై దిగ్విజయ్‌సింగ్ ధ్వజం
• ‘భగీరథ’ అంచనాలు పెంచి ముడుపులు దండుకుంటోంది
• కేసీఆర్‌కు అక్రమార్జనపై ఉన్న ప్రణాళిక సంక్షేమంపై లేదు
• అవినీతి కోసమే చంద్రబాబుకు కేంద్రం ‘పోలవరం’ బాధ్యత
• ముగిసిన సర్పంచులు, ఉప సర్పంచుల శిక్షణా శిబిరం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిం చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మిషన్ భగీరథ పథకంలో వేల కోట్ల రూపాయలను కేసీఆర్ కుటుంబం దిగమింగుతోందన్నారు. పైపులైన్లు, తవ్వకం పనులకు భారీగా అంచనాలను పెంచి ముడుపులు తీసుకోవడంలో తీరిక లేకుండా ఉందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ప్రతినిధులకు జరిగిన రెండు రోజుల శిక్షణా శిబిరంలో మంగళవారం ఆయన ముగింపు ఉపన్యాసం చేశారు.
సీఎం కేసీఆర్‌కు అక్రమార్జన, అవినీతి మార్గాలపై ప్రణాళిక... ప్రజాసంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారంపై లేదని మండిపడ్డారు. ఈ అవినీతి సొమ్ముతో ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను సంతలో కూరగాయల్లా కేసీఆర్ కొనుక్కుంటున్నారన్నారు. అదే అవినీతితో సంపాదించిన ధనంతో వచ్చే ఎన్నికల్లో ఓట్లు కూడా కొనుగోలు చేయాలని కేసీఆర్ కలలు కంటున్నారని, కానీ ప్రజలు అమ్ముడుపోయే సరుకు కాదని చెప్పాల్సిన అవసరముందన్నారు. అసలైన కాంగ్రెస్‌వాదులంతా కాంగ్రెస్‌తోనే ఉన్నారని...కేవలం పనికి రాని సరుకే టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిందని పేర్కొన్నారు.
స్థానిక సంస్థలకు కేంద్రం మొండిచెయ్యి...
గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తోందని... స్థానిక సంస్థలకు నిధులు, అధికారాలు ఇవ్వకుండా నియంతృత్వ ధోరణి వ్యవహరిస్తోందని దిగ్విజయ్ దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం తరహాలోనే ప్రవర్తిస్తోందన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే అధికార వికేంద్రీకరణ జరిగిందని దిగ్విజయ్ చెప్పారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం భూమిని కొనుగోలు చేయడం సరికాదని, 2013 భూసేకరణ చట్టం ప్రకారమే భూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
పోలవరం బాధ్యత కేంద్రమే తీసుకోవాలి
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. పోలవరం నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్‌కే అప్పగిస్తే తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు ఆదివాసీ ప్రాంతాలు పోలవరంలో మునిగిపోతున్నాయని, తెలంగాణకు చెందిన ఏడు గిరిజన మండలాలను ఏపీకి కోల్పోయామన్నారు. పోలవరాన్ని ఇష్టారాజ్యంగా నిర్మిస్తే తెలంగాణ రాష్ట్రం పర్యావరణ అసమతౌల్యత, ముంపు వంటి నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
సమావేశంలో ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు, ఏఐసీసీ కార్యదర్శి ఆర్.సి.కుంతియా, ప్రతినిధి శ్రీనివాసన్, ప్రతిపక్ష నేతలు, కె.జానా రెడ్డి, షబ్బీర్ అలీ, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఏఐసీసీ అధికార ప్రతినిధి మధు యాష్కీ, కార్యదర్శి వి.హనుమంతరావు, టీపీసీసీ శిక్షణా విభాగం చైర్మన్ పొన్నం ప్రభాకర్ ప్రసంగించారు.
వైఎస్ ఉన్నప్పుడే అధికారాల బదలాయింపు: మణిశంకర్
ఉమ్మడి ఏపీ సీఎంగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడే స్థానిక సంస్థలకు అధికారాల బదలాయింపు జరిగిందని కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్ గుర్తుచేశారు. ఇది దేశవ్యాప్తంగా ఆదర్శనీయమన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లోనూ వైఎస్ అగ్రస్థానంలో ఉన్నారన్నారు. వైఎస్ అమలు చేసిన అంశాలను ఆయుధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. గ్రామీణ వ్యవస్థకు పంచాయతీలే పునాది అని, పంచాయతీరాజ్ వ్యవస్థ బలంగా ఉంటేనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. సర్పంచుల అధికారాలన్నీ అధికారుల చేతుల్లో ఉన్నంతకాలం ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందవన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు స్థానిక సంస్థలను భ్రష్టు పట్టించారన్నారు. తెలంగాణలో కేసీఆర్ నియంత పాలన సాగిస్తున్నారన్నారు.
బాబుకు ‘పోలవరం’ లాలీపాప్
పోలవరం నిర్మాణ బాధ్యతలను ఏపీ సీఎం చంద్రబాబుకు లాలీపాప్‌లాగా అవినీతి చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇస్తోందని దిగ్విజయ్ ఆరోపిం చారు. ఈ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం చేపడితే రెండు రాష్ట్రాల మధ్య సమస్యలొచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. అందువల్ల దీన్ని పూర్తి చేయాలని కోరారు.