పార్కులు వెలవెల!
వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్ హెచ్చరికల ఎఫెక్ట్!
పోలీసులు అండగా నిలిచినా..
స్వాగతం పలికేందుకు సీపీఐ నాయకులు వచ్చినా...
పార్కులకు రాని ప్రేమికులు
కవాడిగూడ/వెంగళరావునగర్: ప్రేమికులతో ప్రతి రోజూ కళకళలాడే పార్కులు శనివారం ప్రేమికుల దినోత్సవం రోజున మాత్రం బోసిపోయాయి. వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ హెచ్చరికల నేపథ్యంలో నగరంలోని ఇందిరాపార్కు, సంజీవయ్య పార్కు, కృష్ణకాంత్, కేబీఆర్ తదితర పార్కులన్నీ వెలవెలబోయాయి. పాశ్చాత్య సంస్కృతికి చిహ్నమైన ప్రేమికుల రోజును బహిష్కరిస్తున్నట్లు వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ సంస్థలు ప్రకటించడంతోపాటు, ప్రేమికులు పార్కుల్లోనూ, రహదారుల వెంట కనిపిస్తే వారికి పెళ్లి చేస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే. కాగా ప్రేమికులను అడ్డుకున్నా, వారి పట్ల దౌర్జన్యపూరితంగా వ్యవహరించినా తీవ్రచర్యలు తీసుకుంటామని, ప్రేమికులకు అండగా ఉంటామని సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి ప్రకటించి, ఇందిరాపార్కును సందర్శించినా ప్రేమికులు వచ్చేందుకు సాహసించలేదు. ఇందిరాపార్కు ప్రవేశ రుసుం రూ.5, బైక్, ఫోర్ వీలర్ వాహనాల పార్కింగ్‌కు కనీసం రూ. 10 ఉంటుంది. ప్రతిరోజు దాదాపు రూ.7 వేలకు పైగా ఆదాయం వస్తుంది. పార్కింగ్‌కు రూ.3 వేలకు పైగా వస్తాయి. అలాంటిది శనివారం మాత్రం ఎంట్రెన్స్ టెకెట్లకు రోజంతా కనీసం వెయ్యి రూపాయలు రాలేదు. అలాగే పార్కింగ్ కౌంటర్‌కు కనీసం రూ. 600 కూడా రాలేదు. కాగా ముందు జాగ్రత్తగా నగరంలో 36 మందిని అదుపులోకి తీసుకున్నామని డీసీపీ కమలాసన్‌రెడ్డి వెల్లడించారు.
సీపీఐ గులాబీ పూల స్వాగతం...
ప్రేమికులకు గులాబీ పూలతో స్వాగతం పలికేందుకు సీపీఐ హైదరాబాద్ నగర కార్యదర్శి డాక్టర్ సుధాకర్‌తో పాటు, ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్ కార్యకర్తలు ఇందిరాపార్కు వద్ద ఎదురు చూశారు. కానీ ప్రేమికులెవరూ కన్పించలేదు. కార్యక్రమంలో సీపీఐ నగర నాయకులు రాకేష్ సింగ్, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివరామకృష్ణ, నాయకులు సత్యప్రసాద్, దర్మేంధర్, వంశీ, ఏఐవైఎఫ్ నాయకురాలు ఉషారాణి, నాయకులు రాజేందర్, బాలు, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. ఇక ముందుజాగ్రత్తగా పోలీసులు ప్రేమికులకు మద్దతు తెలిపేందుకు వచ్చిన ఏఐఎస్‌ఎఫ్ నాయకులు వేణు, కృష్ణ నాయక్, నరేష్, శ్రీనివాస్‌లను అదుపులోకి తీసుకున్నారు. కాగా యూసుఫ్‌గూడ కృష్ణకాంత్‌పార్కుకు జూబ్లీహిల్స్ పోలీసులు ఉదయమే వచ్చి ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూపర్‌వైజర్లకు, సెక్యూరిటీ గార్డులకు సూచించారు. ఉదయం 11 గంటల తర్వాత పార్కు తెరిచి పోలీసులు కాపలాగా ఉన్నప్పటికీ యువతీయువకులెవరూ రాలేదు. కనీసం సందర్శకులు కూడా రాకపోవడంతో పార్కు బోసిపోయింది.