వీహెచ్‌పీ అంతర్జాతీయ సహ ప్రధాన కార్యదర్శి సురేంద్రకుమార్‌జైన్
హైదరాబాద్ : దేశంలో ఉంటున్న ప్రతి ఒక్కరూ భారత్‌మాతాకీ జై, గోమాతాకీ జై అనాల్సిందేనని, అలా అననివారు దేశం నుండి వెళ్లిపోవాల్సిందేనని వీహెచ్‌పీ అంతర్జాతీయ సహ ప్రధాన కార్యదర్శి సురేంద్రకుమార్‌జైన్ అన్నారు. హనుమాన్ జయంతి వేడుకలను పురస్కరించుకొని శుక్రవారం కోఠి వద్ద జరిగిన హనుమాన్ శోభాయాత్రను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. భారతదేశంలో అన్ని వర్గాలవారికి, అన్ని మతాలవారికి సమానహక్కులు ప్రభుత్వం కల్పిస్తుందని, ప్రతి ఒక్కరూ భారతమాతను గౌరవించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.
గత 12 సంవత్సరాల క్రితం భజరంగ్‌దళ్,వీహెచ్‌పీల ఆధ్వర్యంలో ప్రారంభమైన హనుమాన్ జయంతి శోభాయాత్ర నేడు దేశంలోని ప్రతి నగరంలో ప్రతి ప్రాంతంలో కూడా ఆదర్శంగా నిలిచిందన్నారు. పోలీసు ల తీరు దారుణంగా ఉందని భజరంగ్‌దళ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వై. భానుప్రకాష్ మండిపడ్డారు. ప్రతి సంవత్సరం శాంతియుతంగా ర్యాలీలు నిర్వహిస్తుంటే పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో బీజేపీ, భజరంగ్‌దళ్, వీహెచ్‌పీ నేతలు గోవింద్‌రాఠి, యమన్‌సింగ్, విమల్‌దాల్మియా, భరత్‌వంశీ, సత్యనారాయణ, రమేష్, వీరేశలింగం, లక్ష్మణ్‌రావు, గిరిధర్, ప్రకాష్ గిరి, అనిల్, కృష్ణ, శ్రీనివాస్ యాదవ్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.