కార్మిక చట్టాల్లో మార్పులు తెస్తాం
కేంద్ర కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: కార్మికుల హక్కులను కాపాడుతూ వారి సంక్షేమం, అభివృద్ధి కోసం చట్టాల్లో మార్పులు చేయనున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. శుక్రవారం బర్కత్‌పురలోని రీజినల్ పీఎఫ్ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి కార్మికుడితోబ్యాంక్ ఖాతా తెరిపించే బాధ్యత కంపెనీదేనన్నారు. దేశంలో తొలిసారిగా భవన నిర్మాణ, బీడీ కార్మికులకు పీఎఫ్ సదుపాయం కల్పించి, ఐడీ కార్డులు, యూనివర్సల్ అకౌంట్ నెంబర్లు ఇస్తామని తెలిపారు. ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ‘ఎంప్లాయీస్ డిపాజిట్- బ్యాంకు లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీం’ కింద చెల్లిస్తున్న పరిహారాన్ని రూ.1.30 లక్షల నుంచి రూ.3.60 లక్షలకు పెంచినట్లు మంత్రి వెల్లడించారు.
సికింద్రాబాద్ బోయిగూడ కమాన్ వద్దనున్న ఈఎస్‌ఐ ఆస్పత్రిని 200 పడకల ఆస్పత్రిగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. అదేవిధంగా రామగుండం, వరంగల్ ఈఎస్‌ఐ ఆస్పత్రులను అప్‌గ్రేడ్ చేస్తామన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పైడి భీమవరం, తిరుపతిల్లో 100 పడకల ఆస్పత్రులు, నాచారంలోని ఈఎస్‌ఐ ఆస్పత్రిలో దంత కళాశాలను ఏర్పాటు చేయనున్నట్లు దత్తాత్రేయ తెలిపారు. మహిళల కోసం ప్రత్యేకంగా శిక్షణాకేంద్రాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా ఫ్యాషన్ టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ సెంట్రల్ పీఎఫ్ కమిషనర్ కేవీ సర్వేశ్వరన్, రీజినల్ కమిషనర్ ఎంవీఎస్‌ఎస్ శ్రీ కృష్ణ, కమిషనర్లు అశ్రఫ్ కామిల్, రవీంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.