
డీఎస్, కెప్టెన్ ఏకగ్రీవం!
- రాజ్యసభకు మంగళవారం నామినేషన్లు వేసిన నేతలు
- అభ్యర్థుల వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
- వారి ఎన్నికపై అధికారిక ప్రకటనే తరువాయి
సాక్షి, హైదరాబాద్
రాష్ట్రంలో రెండు స్థానాలకు జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ అభ్యర్థులుగా ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్), కెప్టెన్ లక్ష్మీకాంతరావులు మంగళవారం నామినేషన్లు దాఖలు చేశారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెంట రాగా ఉదయం 11.55 నిమిషాలకు వారు నామినేషన్ పత్రాలను శాసనసభా కార్యదర్శి, రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజ సదారాంకు సమర్పించారు. నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన మంగళవారం రెండు స్థానాలకు రెండు నామినేషన్లు మాత్రమే దాఖలు కావడంతో డీఎస్, కెప్టెన్‌ల ఎన్నిక ఏకగ్రీవం కానుంది. బుధవారం నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు శుక్రవారం చివరి రోజు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిశాక డీఎస్, కెప్టెన్‌లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించనున్నారు.
రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తా: డీఎస్
సీఎం కేసీఆర్ అనుగ్రహంతోనే తనకు రాజ్యసభ అవకాశం దక్కిందని.. ఈ పదవిని అదృష్టంగా భావిస్తున్నానని డీఎస్ పేర్కొన్నారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మరో అభ్యర్ధి కెప్టెన్ లక్ష్మీకాంతరావు, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటల రాజేందర్‌లతో కసి అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం నిస్వార్థంగా టీఆర్‌ఎస్‌లో చేరానని డీఎస్ తెలిపారు. ఎవరు ఎక్కడ ఉండాలో కేసీఆర్‌కు బాగా తెలుసని... ఢిల్లీలో తనకున్న పరిచయాలతో రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాను, కేసీఆర్ అనేక విషయాలు చర్చించుకున్నామని, తమ మధ్య మంచి అవగాహన ఉండేదని, చాలా విషయాల్లో సమన్వయంతో పనిచేశామని డీఎస్ వివరించారు. రాజ్యాంగబద్ధంగా తెలంగాణ సాధించిన కేసీఆర్ బంగారు తెలంగాణకు అర్థం చెప్పారని, ఆయన అంచనాల మేరకు పనిచేస్తానన్నారు. వచ్చే మూడేళ్లలో 80 శాతం ప్రాజెక్టులు పూర్తవుతాయన్నారు. వివిధ ఉప ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ, కార్పొరేషన్ల ఎన్నికలతో టీఆర్‌ఎస్ బలం మరింత పెరిగిందన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో పనిచేయడం తన అదృష్టమన్నారు. తెలంగాణ ఉద్యమం జరిగిందే నిధులు, నీళ్లు, నియామకాల కోసమని, తెలంగాణ ఉద్యమ ఫలితంగానే తాను రాజ్యసభకు వెళ్తున్నానన్నారు. రాష్ట్ర ప్రజలు సీఎం కేసీఆర్‌ను నమ్ముతున్నారని డీఎస్ వివరించారు.
ఇది చేతల ప్రభుత్వం: కెప్టెన్
రాష్ట్రంలో ఉన్నది చేతల ప్రభుత్వమని మరో అభ్యర్ధి కెప్టెన్ లక్ష్మీకాంతరావు తెలిపారు. ఉద్యమ సమయం నుంచే కేసీఆర్‌తో కలసి పనిచేశానని, ఎన్నికల హామీలను కేసీఆర్ పూర్తి స్థాయిలో ఆచరణలో పెట్టారని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పూర్తి స్థాయిలో శ్రమిస్తానని, కేసీఆర్ చేపడుతున్న పథకాలకు ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోందన్నారు. బంగారు తెలంగాణ కోసం కేసీఆర్‌తో కలసి నడుస్తానన్నారు.
సమర్థులు, అనుభవజ్ఞులకే సీట్లు దక్కాయి: నాయిని, ఈటల
సమర్థులకే రెండు రాజ్యసభ సీట్లు దక్కాయని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం డీఎస్, కెప్టెన్‌లు బాగా పనిచేస్తారని ఆశిస్తున్నానన్నారు. అనుభవం ఉన్న నాయకులకే అవకాశం దక్కిందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఉద్యమ సమయంలో చెప్పిన మాటలన్నీ నిజమవుతున్నాయని, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నామన్నారు. తెలంగాణలో సీనియర్లకే అవకాశం దక్కిందని, వారి అనుభవం రాష్ట్రాభివృద్ధికి ఉపయోగ పడుతుందని కరీంనగర్ ఎంపీ బి. వినోద్‌కుమార్ అన్నారు. ఏపీలో టీడీపీ వ్యాపారవేత్తలకు రాజ్యసభ టికెట్లు ఇచ్చిందని, తెలంగాణలో మాత్రం ఉద్యమకారులను రాజ్యసభకు పంపుతున్నామని, ఇదే టీడీపీకి, టీఆర్‌ఎస్‌కు ఉన్న తేడా అని చెప్పారు. డీఎస్, కెప్టెన్‌లకు ఢిల్లీలో స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నామని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ పేర్కొన్నారు. ఆంధ్రా మూలాలున్న టీడీపీ తెలంగాణలో అంతర్ధానం కావాల్సిందేనన్నారు. కార్యక్రమంలో మంత్రులు మహేందర్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావుగౌడ్, జోగు రామన్న, చందూలాల్ పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.