కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలు, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల దరఖాస్తులపై ఎన్నికల సంఘం
సాక్షి, హైదరాబాద్: కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలు, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో తమ పేర్లను చేర్చాలంటూ 82 దరఖాస్తులు వచ్చాయని కేంద్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది. ఇందులో 40 దరఖాస్తులను ఆమోదించి, మిగిలిన 42 ను తిరస్కరించామంది. ఆమోదించిన, తిరస్కరించిన దరఖాస్తుదారుల వివరాలను ఎన్నికల సంఘం అధికారులు కోర్టు ముందుంచారు.
అలాగే వాటిని తొలుత, అనంతరం పరిశీలన చేసిన అధికారుల వివరాలను కూడా కోర్టుకు సమర్పించారు. ఈ వివరాలన్నింటి ఆధారంగా ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నవి వాస్తవమో కాదో చెప్పాలని పిటిషనర్‌కు హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను మార్చి 1కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితాలో అనర్హులకు స్థానం కల్పించారంటూ అనంతపురం జిల్లాకు చెందిన జి.ఓబులు హైకోర్టులో పిటిషనర్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.