ఓపీ సేవలపై ఉద్యోగుల అనాసక్తి!
♦ 20 లక్షల మందికిగాను సేవలు పొందింది 2,393 మందే
♦ స్పెషలిస్టులు లేక వెలవెలబోతున్న ప్రభుత్వాసుపత్రులు
♦ అగమ్యగోచరంగా మారిన హెల్త్ కార్డుల పథకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో హెల్త్‌కార్డుల పథకం కింద.. మధుమేహం, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోవడానికి ఉద్యోగులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీర్ఘకాలిక వ్యాధుల ఓపీ(ఔట్ పేషెంట్) సేవలను తప్పనిసరిగా ప్రభుత్వాసుపత్రుల్లోనే పొందాలనే నిబంధన ఉంది. ఉద్యోగులకు మెరుగైన ఓపీ సేవలు అందించడానికి ప్రత్యేక వేళల్లో వైద్యులను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. కానీ, ఉద్యోగులు మాత్రం సర్కారు ఆసుపత్రులకు వెళ్లడానికి ససేమిరా అంటుండడం గమనార్హం. సంవత్సర కాలంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు పొందిన వారి వివరాలను ‘ఎన్టీఆర్ వైద్యసేవ’ అధికారులు సేకరించారు. ఈ ఏడాది కాలంలో 2,393 మందే ప్రభుత్వాసుపత్రుల్లో ఓపీ సేవలను వినియోగించుకున్నారని తేలింది. రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మందికిపైగా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, పెన్షనర్లు హెల్త్‌కార్డుల పథకం కింద వైద్య సేవలు పొందడానికి అర్హులు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు, ఔషధాలను అందించడానికి ప్రభుత్వం రూ.46.748 లక్షలు ఖర్చు చేసింది.
స్పెషలిస్టులు ఎక్కడ?..: దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రుల్లోనే ఔట్‌పేషెంట్ సేవలు వినియోగించుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, ప్రభుత్వాసుపత్రుల్లో స్పెషలిస్టులు అందుబాటులో లేరు. జనరల్ మెడిసిన్ డాక్టర్లు మాత్రమే ఉన్నారు. ఎండోక్రినాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ వంటి స్పెషలిస్టులు ఏ ఆస్పత్రిలోనూ లేరు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకూ ప్రత్యేక ఓపీ సేవలు అందిస్తామని ప్రకటించారు. దీనికోసం ప్రత్యేకంగా వైద్యులు రావడం లేదు. ఉద్యోగులు, పెన్షనర్లు, కుటుంబ సభ్యులు 20 లక్షలకు పైగా ఉంటే కేవలం 2,393 మందే ప్రభుత్వాసుపత్రుల మెట్లు ఎక్కడం గమనార్హం. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఔట్‌పేషెంట్ సేవలు సక్రమంగా అందడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు.