పెద్దలను‘గే’లి చేశాడు
అనేక మంది పేర్లతో ఫేస్‌బుక్ ప్రొఫైల్స్
వారు స్వలింగ సంపర్కులంటూ ప్రచారం
ఎట్టకేలకు వైద్యుడి ఫిర్యాదుతో కటకటాల్లోకి
హైదరాబాద్ : నగరానికి చెందిన గౌరవప్రదమైన వ్యక్తులతో సహా అనేక మందిని కొన్ని నెలలుగా అలా‘గే’ వేధిస్తున్న యువకుడిని రాచకొండ సైబర్ సెల్ అధికారులు పట్టుకున్నారు. పలువురు ప్రముఖుల ఫొటోలను వినియోగించి ఫేస్‌బుక్‌లో బోగస్ ప్రొఫైల్స్ క్రియేట్ చేయడంతో పాటు వారంతా స్వలింగ సంపర్కులంటూ ప్రచారం చేస్తూ ఇబ్బందులకు గురి చేశాడని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ ఎం.భగవత్ శుక్రవారం వెల్లడించారు. బాచుపల్లికి చెందిన తుమ్మల సురేష్ మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో టెక్నికల్ లీడ్‌గా పని చేస్తున్నాడు. కొన్న్ళ్లా క్రితం ఇతడి వైవాహిక జీవితం విచ్ఛిన్నం కావడంతో మరో ఇద్దరు స్నేహితులతో కలిసి స్వలింగ సంపర్కుడిగా మారాడు. ఫేస్‌బుక్‌ను విరివిగా బ్రౌజ్ చేసే సురేష్ అందులో ఉన్న అనేక మంది ఫొటోలను డౌన్‌లోడ్ చేసి వాటిని వినియోగిస్తూ వారి పేర్లతోనే ప్రొఫైల్స్ క్రియేట్ చేసే వాడు. అందులో తాము స్వలింగ సంపర్కులమని, ఆసక్తి ఉన్న వారు సంప్రదించాలంటూ పోస్టులు పెట్టడంతో పాటు వారి ఫోన్ నెంబర్లనే పోస్ట్ చేసే వాడు. దీంతో అనేక మంది నుంచి బాధితులకు ఫోన్‌కాల్స్ వెళ్ళేవి. అంతేగాకుండా పలువురికి ఫోన్లు చేసిన సురేష్ తాను స్వలింగ సంపర్కుడినని, తనతో స్నేహం చేసే ఆసక్తి ఉందా? అని అడుగుతూ ఇబ్బందులు పెట్టేవాడు.
ఇప్పటి వరకు అనేక మంది ఇతడి బారినపడినా... పరువు పోతుందనే ఉద్దేశంతో ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. సురేష్ ఇటీవల నగరానికి చెందిన ఓ ప్రముఖ వైద్యుడి (సర్జన్) పేరుతో ఫేస్‌బుక్‌లో బోగస్ ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. ఇందులోనూ ‘అలాంటి’ పోస్టు పెట్టడంతో పాటు కొన్ని స్వలింగ సంపర్కులకు చెందిన వెబ్‌సైట్ అడ్రస్‌లు పోస్ట్ చేయడంతో సదరు వైద్యుడి బతుకు దుర్భరమైపోరుుంది. ప్రతి రోజూ 40 నుంచి 50 మంది అపరిచితుల నుంచి ఫోన్లు రావడం ప్రారంభమయ్యారుు. ఫలితంగా తీవ్ర మానసిక ఆందోళనకు లోనైన వైద్యుడు రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన సైబర్ సెల్ అధికారులు సాంకేతిక ఆధారాలను బట్టి సురేష్‌ను నిందితుడిగా గుర్తించారు. ఇతడిని అరెస్టు చేసిన పోలీసులు మియాపూర్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.