
కొత్త రాష్ట్రంలో 2700 మంది రైతుల ఆత్మహత్యలు: కోదండరాం
కొత్త రాష్ట్రంలో 2700 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు.
తెలంగాణ రైతాంగం సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని, కొత్త రాష్ట్రంలో 2700 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు. ప్రస్తుతం దేశంలోనే రైతుల ఆత్మహత్యల విషయంలో తెలంగాణ 2స్థానంలో ఉందని వెల్లడించారు. రైతుల సమస్యలపై పోరాడేందుకు 24 మందితో రైతు జేఏసీ తాత్కాలిక కమిటీని నియమించామని, అందులో తాను కూడా ఒక సభ్యుడినని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం తెలిపారు. ఆయన మంగళవారం నాడు హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. అన్ని జిల్లాల కమిటీలను ఏప్రిల్ నాటికి పూర్తి చేస్తామన్నారు.
ప్రాజెక్టుల పేరుతో రైతుల భూములను ప్రభుత్వం లాక్కుంటున్నదని విమర్శించారు. వ్యవసాయ అనుబంధ రంగాలలో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఏ మార్పూ లేదన్నారు. పంట ధరల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. గొర్రెలను ఇస్తున్నారు కానీ వాటికి వైద్యం అందించేందుకు వెటర్నరీ ఆసుపత్రులను మెరుగుపరుస్తున్పారా అని ఆయన ప్రశ్నించారు. రైతులకు లాభసాటి ధర లభించేలా కర్ణాటక తరహాలో ఒక నిధిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.