సింగరేణి కార్మికులకు పండుగ బొనాంజా
- దీపావళి బోనస్ రూ.57 వేలు
- దసరా అడ్వాన్స్‌గా రూ.25 వేలు
- ఒక్కో కార్మికుడికి రూ.82 వేలు
- మొత్తం రూ.456 కోట్లు..
- ప్రకటించిన యాజమాన్యం
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థ కార్మికులకు తీపి కబురు. దసరా, దీపావళి పండుగల సందర్భంగా కార్మికులకు ఒక్కొక్కరికి రూ.82 వేలు చెల్లించనున్నట్లు సంస్థ యాజమాన్యం ప్రకటించింది. దీపావళి సందర్భంగా పీఎల్‌ఆర్ బోనస్‌గా రూ.57 వేలు, దసరా పండుగ అడ్వాన్స్‌గా రూ.25 వేలు చెల్లించనున్నట్లు సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. కార్మికులందరికీ కలిపి మొత్తం రూ.456 కోట్లు చెల్లిస్తామని పేర్కొన్నారు. గతంతో పోల్చితే ఈసారి బోనస్ పెంచినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు ఒక్కో కార్మికుడికి పీఎల్‌ఆర్ (దీపావళి) బోనస్‌ను రూ.54 వేల నుంచి రూ.57 వేలకు, దసరా పండుగ అడ్వాన్స్‌ను రూ.18 వేల నుంచి రూ.25 వేలకు పెంచినట్లు తెలిపారు.
దీపావళి బోనస్ కింద మొత్తం రూ.336 కోట్లు, దసరా అడ్వాన్స్ కింద మొత్తం రూ.120 కోట్లను కార్మికులకు చెల్లించనున్నట్లు తెలిపారు. ఈ నెల 22న కార్మికుల బ్యాంకు ఖాతాల్లో దసరా అడ్వాన్స్ జమ చేస్తామని చెప్పారు. దీపావళి బోనస్‌గా ఒక్కో కార్మికుడికి 201415లో రూ48,500, 201516లో రూ.54 వేలు చెల్లించగా.. ఈ ఏడాది రూ.57 వేలు చెల్లించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. దీపావళి పండుగకు ముందు అక్టోబర్ రెండో వారంలో ఈ బోనస్‌ను కార్మికుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి శుభాకాంక్షాలు తెలిపారు.