‘శ్రీశైలం’ భద్రతపై దృష్టి
18, 19 తేదీల్లో కేంద్ర జల సంఘం సమీక్ష
హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టుకు అంచనాకు మించి వరద వచ్చిన సందర్భాల్లో డ్యామ్ దెబ్బతినకుండా తక్షణం చేపట్టాల్సిన మరమ్మతులపై కేంద్ర జల వనరుల శాఖ దృష్టిపెట్టింది. శ్రీశైలం డ్యామ్ భద్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఈ నెల 18, 19 తేదీల్లో రూర్కీలో జరిగే నేషనల్ కమిటీ ఆన్ డ్యామ్ సేఫ్టీ (ఎన్‌సీడీఎస్) సమావేశంలో దీన్ని చర్చించనుంది. 216 టీఎం సీల సామర్థ్యం కలిగిన శ్రీశైలం డ్యామ్ ఎత్తు 885 అడుగులు కాగా, పొడవు 512 మీటర్లు (1,680 అడుగులు). 12 రేడియల్ క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి నిర్వహణ చేపడుతున్నారు. ఈ ఎత్తులో ప్రస్తుతం ఉన్న క్రస్ట్‌గేట్ల ద్వారా మొత్తంగా 15 లక్షల క్యూసెక్కుల వరదకు నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉంది. అంతకుమించి జలాలు వచ్చిన సమయంలో డ్యామ్ నిర్వహణ సులభమయ్యేది కాదు. 2009 కృష్ణాలో వచ్చిన వరదలు డ్యామ్ భద్రతపై అనేక ప్రశ్నలు లేవనెత్తాయి.
డ్యామ్ సామర్థ్యాన్ని మించి 25 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తడంతో నిర్వహణ కష్టసాధ్యమై భారీ నష్టం చేకూరింది. కుడి, ఎడమ కాల్వ కింద ఉన్న 1,670 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రాలు ముంపునకు గురయ్యాయి. దీంతో దీనిపై చర్చించిన ఎన్‌సీడీఎస్ ఈ ప్రాజెక్టు స్పిల్‌వే సామర్థ్యాన్ని పెంచాలని సూచించింది. దీంతో పాటే ప్రాజెక్టుకు వచ్చే వరద నీటిలో కొంత భాగాన్ని మళ్లించాలని సూచించినా అమల్లోకి రాలేదు. దీంతో దీనిపై మళ్లీ చర్చించి ముందస్తు చర్యలకు దిగాలని కేంద్రం భావిస్తోంది.