పరిగణనలోకి నూతన ఆదాయ, భూపరిమితి పెంపు
* ఆహార భద్రతా కార్డుల జారీపై కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు
* 48 లక్షల దరఖాస్తులకూ తప్పని పునఃపరిశీలన
* డిసెంబర్ 15 నాటికి పూర్తి చే యాలని ప్రభుత్వ నిర్ణయం
* జనవరి 15 తరువాతే కార్డుల జారీ సాధ్యమంటున్న అధికారులు
సాక్షి, హైదరాబాద్: దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అందజేయనున్న ఆహార భద్రతా కార్డు (ఎఫ్‌ఎస్‌సీ) దరఖాస్తుల పరిశీలన మళ్లీ మొదటికొచ్చింది. రేషన్‌కార్డు పొందేందుకు ఉన్న ఆదాయ, భూపరిమితిని పెంచిన నేపథ్యంలో అందుకనుగుణంగా ఆహారకార్డుల లబ్ధిదారుల ఎంపిక పరిశీలన జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై జిల్లా కలెక్టర్లకు తాజాగా మార్గదర్శకాలను సైతం జారీ చేసింది. దీంతో మొత్తం 96 లక్షల దరఖాస్తుల్లో ఇప్పటివరకు పూర్తిచేసిన 48 లక్షల దరఖాస్తుల పునఃపరిశీలన అనివార్యంగా మారింది.
ఇప్పటికే పింఛన్ దరఖాస్తుల పరిశీలనలో ఊపిరిసలపని క్షేత్రస్థాయి అధికారులకు డిసెంబర్ 15 నాటికి భద్రతాకార్డుల పరిశీలనా పూర్తిచేయాలని ప్రభుత్వం విధించిన గడువు తలకుమించిన భారంగా మారనుంది. ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కొత్తగా ఇచ్చిన మార్గదర్శకాల మేరకు దరఖాస్తుల పరిశీలన జరపాలని ప్రభుత్వం సూచించింది. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో 90 శాతం, వరంగల్, మెదక్, మహబూబ్‌నగర్, కరీంగనర్ జిల్లాల్లో 50 శాతానికి పైగా దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. ఒక్క అనర్హుడికి కార్డు ఇచ్చినా కఠిన చర్యలు తప్పవని ఓ పక్క ప్రభుత్వం హెచ్చరిస్తున్న తరుణంలో కొత్త మార్గదర్శకాల మేరకు కచ్చితంగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన జరపాల్సి ఉంటుందని, పనిభారం రెండింతలు అవుతుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.
డిసెంబర్ 15 నుంచి సాధ్యమేనా..?
ఇదిలా ఉండగా వచ్చేనెల 15 నుంచి లబ్ధిదారులకు ఆహార భద్రతా కార్డులను పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే నిర్ణీత గడువులో ఇప్పటికే పరిశీలన చేసిన కార్డులతో పాటు అదనపు 50 లక్షల కార్డులను ఈ సమయంలోగా పూర్తి చేయడం సాధ్యమేనా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పరిశీలన కొంత చురుగ్గా సాగినా, హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ వంటి పట్టణాల్లో నిర్ణీత గడువులోగా పూర్తి చేయడం కష్టమేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉన్న కార్డుల సంఖ్యను బట్టి జనవరి రెండోవారానికి గానీ కొత్త కార్డుల జారీ సాధ్యమని స్పష్టం చేస్తున్నాయి.
భద్రతా కార్డుల పరిశీలన మళ్లీ మొదటికి!
Published Wed, Nov 19 2014 1:04 AM | Last Updated on Tue, Oct 2 2018 8:49 PM
Advertisement