జగన్‌పై కేసు నిలవదని ఆనాడే చెప్పా | Former CS Ramakant Reddy interview with sakshi | Sakshi
Sakshi News home page

జగన్‌పై కేసు నిలవదని ఆనాడే చెప్పా

Published Sun, Feb 26 2017 5:32 AM | Last Updated on Wed, Jul 25 2018 4:42 PM

జగన్‌పై కేసు నిలవదని ఆనాడే చెప్పా - Sakshi

జగన్‌పై కేసు నిలవదని ఆనాడే చెప్పా

‘సాక్షి’ టీవీ ఇంటర్వ్యూలో మాజీ సీఎస్‌ రమాకాంత్‌రెడ్డి ‘మనసులో మాట’

సీబీఐకి రాష్ట్ర సచివాలయం, కేబినెట్‌ రూల్స్‌ తెలియవు
మంత్రివర్గ సమావేశం ఎందుకు నిర్వహిస్తారో కూడా తెలియదు
కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయానికి కారణాలు రాయనక్కరలేదు
రూల్స్‌ తెలుసుకోకుండానే వైఎస్‌ జగన్‌ కేసుల్లో విచారణ ప్రారంభించారు
సచివాలయంలో, క్యాంప్‌ ఆఫీసులో జరిగిన సమావేశాలకు జగన్‌ రాలేదు
ఫలానా పని చేసి పెట్టాలంటూ నాకు ఎన్నడూ లేఖ రాయలేదు
వైఎస్‌ చనిపోయిన తర్వాతే జగన్‌ను కలిశా


సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై నమోదు చేసిన కేసులపై దర్యాప్తు చేసిన సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌(జేడీ) వి.వి.లక్ష్మీనారాయణకు రాష్ట్ర సెక్రటేరియెట్, కేబినెట్‌ నిబంధనలు తెలియవని అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్‌ పి.రమాకాంత్‌రెడ్డి చెప్పారు.

జగన్‌కు ఆదాయానికి మించిన ఆస్తులున్నాయంటూ సీబీఐ ఆరేళ్ల క్రితం నమోదు చేసిన కేసుల దర్యాప్తునకు సంబంధించి ఆయన ‘సాక్షి’ టీవీ ప్రతినిధి కొమ్మినేని శ్రీనివాసరావుకు ‘మనసులో మాట’ పేరుతో ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే దర్యాప్తు సంస్థ సీబీఐకి రాష్ట్రానికి సంబంధించిన విషయాలపై అసలు అవగాహన లేదని జగన్‌ కేసు విచారణ జరిగిన తీరు చూస్తే తనకు అర్థమైందని రమాకాంత్‌రెడ్డి తెలిపారు. ఇంటర్వూ్యలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే....

జగన్‌ నాకు ఒక్క లేఖ కూడా రాయలేదు
‘‘నేను ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేసినప్పుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసినప్పుడు సచివాలయంలో గాని, అసెంబ్లీలో గాని, ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలోగాని జరిగిన ఏ ఒక్క సమావేశానికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాలేదు. ఈ విషయం కచ్చితంగా చెప్పగలను. ముఖ్యమంత్రి కుమారుడిగా, ఒక రాజకీయ నాయకుడిగా, ఎంపీగా ఫలానా వాళ్లకు అది ఇవ్వండి అని గాని, ఇవ్వొద్దు అని గాని, నాకు ఇది కావాలని గాని, ఫలానా కంపెనీకి అది కావాలని గాని ఆయన నాకు ఎప్పుడూ ఎలాంటి లేఖ రాయలేదు. ఒక్కరోజు కూడా ఆయన నాకు ఫోన్‌ చేయలేదు. నేను జగన్‌ను ఎప్పుడు కలిశానంటే.. వైఎస్‌ రాజశేఖరరెడ్డి చనిపోయిన తర్వాత నా సానుభూతి తెలియజేయడానికి వెళ్లి కలిశాను. అంతకు ముందెప్పుడూ కలవడం జరగలేదు.

ఫలానా ఆఫీసును రెయిడ్‌ చేయాలని హైకోర్టు చెబుతుందా?  
జగన్‌పై కేసులు పెట్టినప్పుడు సీబీఐ వాళ్లు నన్ను రెండుసార్లు దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌కు పిలిచారు. అప్పుడు సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌గా లక్ష్మీనారాయణ ఉండేవారు. ‘మీరడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి నన్ను పిలిపించారు, సంతోషం. అయితే, ఫలానా వ్యక్తులను కూడా మీరు పిలిపించి మాట్లాడుతారా?’ అని ఆయనను అడిగితే, ‘నేను పిలవడం లేదండి. వారిని ప్రశ్నించడానికి హైకోర్టు నాకు అంతటి పరిధి విధించలేదు’ అని జవాబిచ్చారు. ‘మీరు ఇన్వెస్టిగేటింగ్‌ ఆఫీసర్‌. ఫలానా వాళ్లను ఇంటరాగేట్‌ చేయొచ్చు. ఫలానా వాళ్లను ప్రశ్నలు అడగొచ్చు. ఫలానా వాళ్ల ఇళ్లు, ఆఫీసులను రెయిడ్‌ చేసినా, అక్కడి నుంచి కాగితాలు తెచ్చుకోవచ్చు. ఫలానా ఆఫీసును రెయిడ్‌ చేయాలని హైకోర్టు చెబుతుందా?’ అని అడిగాను. దానికి ఆయన, ‘అబ్బో వద్దండి... అదంతా కదిలిస్తే చాలా ఇబ్బంది అవుతుంది’ అన్నారు. ‘అలాగైతే మీ ఇన్వెస్టిగేషన్‌ మీద నాకు నమ్మకం లేదండి’ అన్నాను. ‘నేను ఈ మాట చెబుతున్నాను, ఇది రికార్డు అవుతుందని నాకు తెలుసు’ అని చెప్పాను.  

సీబీఐకి కనీసం సెక్రటేరియట్‌ రూల్స్‌ కూడా తెలియవు...  
కేబినెట్‌ నిర్ణయాలకు సంబంధించిన ఫైల్స్‌ గురించి ప్రశ్నించడానికి లక్ష్మీనారాయణ నన్ను దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌లోని తన ఏసీ గదిలో కూర్చోబెట్టారు. 48 ఫైళ్లు నా ముందుంచారు. ‘మీరు సంతకం చేశారు, ఇలా నోట్‌ వచ్చినప్పుడు మీరు ఎందుకు నిర్ణయం తీసుకున్నారు’ అని అడిగారు. అప్పుడు నాకు తెలిసిందేమిటంటే.. రాష్ట్రంలో సెక్రటేరియెట్‌ రూల్స్, పద్ధతులు సీబీఐ వాళ్లకు తెలియవు. బేసిక్‌గా అది ఒక ప్రాబ్లమ్‌. కేబినెట్‌ సమావేశం అంటే ఏమిటి? ఏ పరిస్థితుల్లో కేబినెట్‌ సమావేశం నిర్వహిస్తారు..? ఒక కేబినెట్‌కు ఒక సబ్జెక్టు ఎందుకు పంపిస్తాం..? కేబినెట్‌ పరిధి ఏమిటి..? ముఖ్యమంత్రికి గల అధికారాలేమిటి? కేబినెట్‌లో నిర్ణయాలు ఎందుకు తీసుకోవాలి? అనే విషయాలు సీబీఐకి నిజంగా తెలియదు.

వాళ్లకు (సీబీఐ) భారత ప్రభుత్వ రూల్సే తెలుసు కాని రాష్ట్ర ప్రభుత్వ రూల్స్‌ తెలియవు. అసెంబ్లీ నిబంధనలు తెలియవు. స్పీకర్‌కు, ముఖ్యమంత్రికి ఉన్న అధికారాలేమిటో తెలియవు. మాలాంటి కార్యదర్శులకు ఉన్న అధికారులు, విధులు, బాధ్యతలు ఏమిటో వారికి తెలియవు. అవి తెలియజెప్పడానికి నాకు ఒకరోజు పట్టింది. రాష్ట్ర ప్రభుత్వం, మంత్రివర్గం ఎలా పని చేస్తుందో సీబీఐకి తెలియజెప్పే పనిని సాధారణ పరిపాలన విభాగం(జీఏడీ)లో పనిచేసే ఓ మహిళా అధికారికి అప్పగించాం. ఆమె ఆ పని చేశారు. నాకు బేసిక్‌గా తెలిసింది ఏమిటంటే.. అసలు స్టేట్‌ గవర్నమెంట్‌ రూల్స్, ప్రొసీజర్స్‌ను కూడా అర్థం చేసుకోకుండా సీబీఐ వాళ్లు విచారణ మొదలుపెట్టారు. నేను ఆరోజే ఆయన (లక్ష్మీనారాయణ)ను ఈ కేసులు నిలుస్తాయని నిజంగా మీకు నమ్మకం ఉందా..? అని అడిగితే... సమాధానం ఏమీ చెప్పకుండా నవ్వేశారాయన.  

అనుమతులిచ్చిన అథారిటీని ఎలా పిలుస్తారు?
మీరు విచారణకు ఎవరిని పిలుస్తారు.. అని లక్ష్మీ నారాయణను అడిగాను. అనుమతులు ఇచ్చింది ఎవరు? కేబినెట్‌. దానికి ముఖ్యమంత్రి అధ్యక్షత వహిస్తారు. పిలవడానికి ఆ ముఖ్యమంత్రి ఇప్పుడు లేరు. కాబట్టి కేబినెట్‌లోని మంత్రులందరినీ పిలిచి అడుగుతారా? రూల్‌ ఏమిటంటే.. కేబినెట్‌లో ఏదైనా నిర్ణయం తీసుకుం టే మేము(కార్యదర్శులం) రీజన్స్‌ (కారణాలు) రాయన క్కరలేదు. కేబినెట్‌ ఆ నిర్ణయం ఎందుకు తీసుకుంది అనేది కూడా రాయనక్కరలేదు. మీకు ఆశ్చర్యం అనిపించ వచ్చు గానీ.. అది మా రూల్‌లో ఉంది. కేబినెట్‌లో ఫలానా నిర్ణయాలు ఎందుకు తీసు కున్నారో రికార్డు చేయాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు మీరు ఎవరిని పిలిచి అడుగు తారు అని జేడీతో అన్నాను. అప్పుడు పనిచేసిన మంత్రులను పిలిచి అడిగితే వాళ్లేమంటారు... అది సమిష్టి బాధ్యత అని చెబుతారు. మరి ఎవరిని అడుగుతారు? అనుమతులు ఇచ్చిన అథారిటీని అడగాలి. ఆ అథారిటీని ఎలా పిలుస్తారు? కాబట్టి మీ విచారణపై నాకు పెద్దగా నమ్మకం లేదు అని చెప్పేశాను.

ఐఏఎస్‌లు ఎక్కడికీ పారిపోరు కదా!
‘‘జగన్‌పై పెట్టిన కేసుల విషయంలో అప్పటి ఐఏఎస్‌ అధికారులను అరెస్టు చేయాల్సిన అవసరం లేదేమో. ఎందుకంటే వాళ్లు ఎక్కడికీ పారిపోరు కదా! ఏదో బ్రహ్మాండం బద్దలవుతుంది అనే ఉద్దేశంతో అరెస్టు చేశారమో తెలియదు. ఆ తర్వాత బ్రహ్మాండం బద్దలు కాలేదు అని నేను అనుకుంటున్నాను’’ అని రమాకాంత్‌రెడ్డి వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement