సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సీబీఐని అనుమతించకుండా జీవో తీసుకువచ్చే పరిస్థితి ఎందుకు దాపురించిందని ప్రజలు చర్చించుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఐటీ దాడులు చేయడానికి వచ్చిన వారికి భద్రత ఇవ్వలేమని చెప్పిన సీఎం చంద్రబాబు.. ఈరోజు సీబీఐ దర్యాప్తు జరగకుండా ఏకంగా జీవో తెచ్చారని పేర్కొన్నారు. భయంతోనే ఇలా చేస్తున్నారా అని చంద్రబాబును ప్రశ్నించారు. ఈ జీవోలో కొందరి వ్యక్తిగత ప్రయోజనాలే తప్ప ప్రజా ప్రయోజనాలు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. బ్యాంకుల్లో అవకతవకలు జరిగితే ఎవరు దర్యాప్తు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.
దానికేం సమాధానం చెబుతారు?
రఫేల్ వివాదంపై సీబీఐ దర్యాప్తు జరపాలని కాంగ్రెస్ కోరుతోంది.. మరి మీరు కూడా కాంగ్రెస్‌తోనే ఉన్నారు కదా.. దీనికేం సమాధానం చెబుతారని చంద్రబాబును ఉమ్మారెడ్డి ప్రశ్నించారు.1995- 2018 మధ్య 13 ఏళ్ళ పాటు చంద్రబాబు సీఎంగా ఉన్నారని.. కానీ ఈ 23 ఏళ్ల మధ్య ఎవరూ కూడా సీబీఐపై బ్యాన్ పెట్టలేదని పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందులు కనబడకపోయినా ఈ జీవో ఎందుకు తెచ్చారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కాగా రాష్ట్రంలో సీబీఐకి సోదాలు చేపట్టే అధికారాన్ని నిరాకరిస్తూ.. ‘సమ్మతి’ ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని కేంద్ర సంస్థలు నిగ్గు తెలుస్తున్న వేళ.. ఓ కేంద్ర ప్రభుత్వ సంస్థ విషయంలో ఈ విధంగా వ్యవహరించడం పట్ల ప్రజల్లో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment