♦ కనీస మట్టానికి దిగువన నీటిని తీసుకునేందుకు రంగం సిద్ధం
♦ తెలంగాణ, ఏపీ మధ్య సూత్రప్రాయ అవగాహన
సాక్షి, హైదరాబాద్: తాగునీటి అవసరాలకు ప్రధాన వనరుగా ఉన్న శ్రీశైలం ప్రాజెక్టులో ఇప్పటికే కనీస మట్టాల దిగువ వరకూ నీటిని పంచుకున్న తెలంగాణ, ఏపీ నాగార్జునసాగర్‌పై దృష్టి పెట్టాయి. సాగర్‌లో కనీస నీటి మట్టాల దిగువన ఉన్న నీటిని సైతం వాడుకోవాలని నిర్ణయించాయి. దీనిపై ఇప్పటికే ఇరు రాష్ట్రాల మధ్య జరిగిన అధికారుల స్థాయి చర్చల్లో అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది. జూన్ వరకు శ్రీశైలం నీటిని వాడుకోవాలని, జూన్‌లో కొరతగా ఉండే నీటిని సాగర్ దిగువ నుంచి తీసుకోవాలని అంగీకారానికి వచ్చినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
జూన్ నుంచి వినియోగం కోసం..
శ్రీశైలంలో వినియోగార్హమైన 11.24 టీఎంసీ నీటిని తక్షణ తాగునీటి అవసరాల కోసం తెలంగాణ, ఏపీలు వాడుకునేందుకు కృష్ణా బోర్డు అంగీకరించింది. అందులో 6.5 టీఎంసీలు తెలంగాణకు, 4.5 టీఎంసీలు ఏపీకి కేటాయించింది. ఈ నీటితోనే వేసవిలో నెట్టుకురావాలని సూచించింది. కానీ కేటాయించిన నీటినంతా వాడేసుకున్న ఏపీ.. తన తాగునీటి అవసరాల కోసం శ్రీశైలంలో 790 అడుగుల కనీస మట్టానికి దిగువన 780 అడుగుల వరకు లభ్యతగా ఉండే నీటిని పంచాలని బోర్డుకు విన్నవించింది.
విస్తృత చర్చల అనంతరం 790 అడుగుల దిగువన లభ్యతగా ఉండే 4 టీఎంసీల్లో ఒక టీఎంసీని తెలంగాణకు, 3 టీఎంసీలు ఏపీకి పంచింది. అయితే ఈ నీరు జూన్ తర్వాత అవసరాలకు సరిపోయే పరిస్థితి లేకపోవడంతో... సాగర్ దిగువన నీటిని తోడాలన్న ప్రతిపాదన వచ్చింది. సాగర్ కనీస నీటి మట్టం 510 అడుగుల దిగువన 4 టీఎంసీల వరకు నీటిని తోడుకునే అవకాశం ఉంటుందని, హైదరాబాద్ అవసరాలకు నీటిని తరలించేలా ఎమర్జెన్సీ మోటార్లు అందుబాటులో ఉన్నాయని అధికారుల సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. అయితే దీనిపై ప్రాథమికంగానే నిర్ణయం తీసుకున్నారని, బోర్డు సమక్షంలో మరోమారు సమావేశమై తుది నిర్ణయం చేస్తామని అధికార వర్గాలు వెల్లడించాయి.
సాగర్‌లోనూ తోడేద్దాం!
Published Sat, Apr 9 2016 3:11 AM | Last Updated on Fri, Oct 19 2018 7:22 PM
Advertisement