- ఔటర్ రింగ్‌రోడ్డుపై ఘోర ప్రమాదం
- డివైడర్‌ను ఢీకొన్న కారు.. చెలరేగిన మంటలు
- డోర్లు తెరుచుకోకపోవడంతో సజీవదహనమైన నలుగురు మిత్రులు
- స్నేహితుడిని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దింపి వెళ్తుండగా తెల్లవారుజామున ప్రమాదం
- మృతుల్లో ఒకరిది బెల్లంపల్లి, ముగ్గురిది వరంగల్ జిల్లా
- శోకసంద్రంలో మునిగిన కుటుంబీకులు
హైదరాబాద్/పరకాల/హన్మకొండ/బెల్లంపల్లి: ఔటర్‌పై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్నేహితుడిని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దింపి తిరిగి వస్తున్న నలుగురు మిత్రులు కారులోనే సజీవ దహనమయ్యారు. డివైడర్‌ను ఢీకొనడంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డోర్లు తెరుచుకోకపోవడంతో అందులోనే వారంతా అగ్ని కీలలకు ఆహుతయ్యారు. సోమవారం తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట ఔటర్‌రింగ్ రోడ్డుపై ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. మృతులంతా 30 ఏళ్లలోపు వారే. వారిలో ఇద్దరు వివాహితులు. ఒకరికి మూడు నెలల కూతురు, మరొకరికి 11 నెలల బాబు ఉన్నాడు.
సాగనంపేందుకు వచ్చి మృత్యు ఒడికి..
వరంగల్ రూరల్ జిల్లా పరకాలకు చెందిన బుద్ద శివక్రిష్ణ(26), విజ్జిగిరి శ్రీకాంత్(24), పరకాల మండలం నర్సక్కపల్లెకు చెందిన సురావ్ రాజు(25), మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన శశిధర్(27)లు స్నేహితులు. పరకాల మండలం రాజీపేటకు చెందిన వీరి స్నేహితుడు భాస్కర్ కోయంబత్తూరులో హార్డ్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి భాస్కర్ కోయంబత్తూరు వెళ్తుండడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆయన్ను దింపేందుకు అంతా కలిసి శివకృష్ణకు చెందిన ఆల్టో కారులో వరంగల్ నుంచి బయల్దేరారు.
రాత్రి 3 గంటల సమయంలో భాస్కర్‌ను ఎయిర్‌పోర్టులో వదిలిపెట్టారు. తిరిగి వరంగల్‌కు వస్తుండగా సోమవారం తెల్లవారుజామున 4.30-5 గంటల సమయంలో పెద్ద అంబర్‌పేట ఔటర్ కూడలి వద్దకు రాగానే కారు అదుపు తప్పి వేగంగా డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బయటపడేందుకు యత్నించినా డోర్లు తెరుచుకోలేదు. మంటలు విపరీతంగా చెలరేగడంతో ఆర్తనాదాల మధ్య ప్రాణాలు విడిచారు. ప్రమాదం సంగతి తెలుసుకున్న ఔటర్, పోలీస్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ఫైర్ ఇంజన్‌ను రప్పించినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే కారులోని నలుగురు యువకులు కాలిబూడిదయ్యారు.
సంఘటనా స్థలంలోనే పోస్ట్‌మార్టం
నాలుగు మృతదేహాలకు బంధువులు, పోలీసుల సమక్షంలో సంఘటనా స్థలంలోనే పోస్ట్‌మార్టం పూర్తిచేశారు. మృతదేహాలన్నీ కాలిపోయి ముద్దగా మారిపోవడంతో వాటి గుర్తింపు పోలీసులకు కష్టంగా మారింది. దీంతో చివరికి రక్తనమూనాలు సేకరించి మృతదేహాలను గుర్తించి వారి బంధువులకు అప్పగించారు. ఎల్బీనగర్ డీసీపీ తప్సీర్ ఇక్బాల్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సంఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.
తల్లడిల్లిన కుటుంబీకులు
ప్రమాదం వార్త తెలియగానే నలుగురు యువకుల తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. తమ మిత్రుడు భాస్కర్ ఇంట్లో జరిగిన ఫంక్షన్‌కు హాజరై వస్తామని చెప్పి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయారుు. మృతుల్లో పరకాలకు చెందిన శివకృష్ణ.. బీటెక్ చదువుతూ మధ్యలో ఆపేశాడు. ప్రస్తుతం హన్మకొండలో తన తండ్రి శంకరయ్యకు చెందిన మెడికల్ షాపు నిర్వహణలో పాలుపంచుకుంటున్నాడు. ఆయనకు భార్య, మూడు నెలల కూతురు ఉంది.
శ్రీకాంత్, రాజు, శశిధర్ గ్రూపు పరీక్షలకు హన్మకొండలో గదిని అద్దెకు తీసుకొని ప్రిపేర్ అవుతున్నారు. శ్రీకాంత్ తండ్రి సమ్మయ్య భూపాలపల్లిలో సింగరేణి కార్మికుడిగా పనిచేస్తున్నాడు. బీటెక్ చదివిన శ్రీకాంత్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. బెల్లంపల్లికి చెందిన శశిధర్ ఏడాది కిందట బీటెక్ పూర్తి చేశాడు. ఈయన తండ్రి కూడా సింగరేణి కార్మికుడే. నర్సక్కపల్లికి చెందిన సురావు రాజుకు మూడు సంవత్సరాల కిందటే కృష్ణవేణితో పెళ్లయింది. వీరికి 11 నెలల బాబు ఉన్నాడు. కారు ప్రమాదం సమయంలో మంటల్లో చిక్కుకొని రక్షించాలంటూ నలుగురు మిత్రులు అరుస్తున్న దృశ్యాలు వాట్సప్‌లో ప్రత్యక్షమయ్యాయి. వాటిని చూసిన వారి కుటుంబ సభ్యులు గుండెలు బాదుకుంటున్నారు.
కారులో అగ్నికీలలు.. నలుగురి ఆహుతి
Published Tue, Dec 6 2016 5:44 AM | Last Updated on Mon, Sep 4 2017 10:04 PM
Advertisement
Advertisement