
డ్రైవర్ వద్దన్నా.. మృత్యువు వైపే పయనం
మూడు రోజులుగా నిద్రలేదు.. కళ్లు మూతలు పడుతున్నాయని డ్రైవర్ చెప్పినా వారు వినిపించుకోలేదు..
∙ మూడు రోజులుగా నిద్రపోని డ్రైవర్
∙ ఆలస్యం అవుతుందని ఒత్తిడి చేసిన వైనం
∙ కానగూడూరు వద్ద నిద్రలోకి జారుకున్న డ్రైవర్ ట్రాక్టర్‌ను ఢీ కొన్న టెంపో
∙ ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి
∙ మృతులు ఉప్పల్, వనస్థలిపురం వాసులు
మూడు రోజులుగా నిద్రలేదు.. కళ్లు మూతలు పడుతున్నాయని డ్రైవర్ చెప్పినా వారు వినిపించుకోలేదు.. ఎలాగైనా ఆఫీసు సమయానికి హైదరాబాద్‌కు వెళ్లాలని ఒత్తిడి చేశారు.. చేసేదేమీ లేక దేవుడిపై భారం వేసి డ్రైవర్ ప్రయాణం సాగించాడు.. దువ్వూరు మండలం కానగూడురు గ్రామ సమీపంలో డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతో వాహనం అదుపు తప్పింది. రోడ్డు పక్కనే ఆగి ఉన్న ఇసుక ట్రాక్టర్‌ను ఢీ కొనడంతో ఐదు గురు మృతి చెందగా, ఎనిమిది మందికి గాయాలయ్యాయి. డ్రైవర్ మొర ఆలకించి ఉంటే రోడ్డు ప్రమాదం జరిగి ఉండేది కాదేమో అంటూ క్షతగాత్రులు బోరున విలపించారు.
ప్రొద్దుటూరు క్రైం/దువ్వూరు: దువ్వూరు మండలం కానగూడూరు సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం నిలిపి ఉన్న ఇసుక ట్రాక్టర్‌ను టెంపో ట్రావెలర్ ఢీ కొన్న సంఘటనలో హైదరాబాద్‌లోని ఉప్పల్, వనస్థలిపురం, ఇబ్రహీంపట్నం ప్రాంతాలకు చెందిన వెంకటేశ్వర్లు (51) చందా ధనలక్ష్మి (44), సాయి యోజిత్ (10), అక్షిత్‌కుమార్ (6), గ్రీష్మా (11) మృతి చెందగా శివసాయి, స్వర్ణమ్మ, ప్రేమలత, శ్రీలక్ష్మి, రమేష్, కిషన్, సాయిజయంత్, ఇబ్రహీంపట్నంకు చెందిన పొట్టుముత్తు శ్రీనివాసులకు గాయాలయ్యాయి. బాధితులకు కర్నూలు జిల్లా చాగలమర్రిలోని కేరళ ఆస్పత్రిలో ప్రథమచికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
చంపాపేట్‌లో విషాద ఛాయలు
వనస్థలిపురం/చంపాపేట: తీర్థయాత్రలకు వెళ్లిన ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు తెలియడంతో చంపాపేట డివిజన్ కర్మన్‌ఘాట్ దుర్గానగర్ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. దుర్గానగర్ రోడ్డు నెం.3లోని జగ్‌టాప్ టవర్స్ అపార్ట్‌మెంట్‌లో కిషన్, లక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. కిషన్ హైటెక్ సిటీలో సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తుండగా, లక్ష్మి విద్యుత్ సౌధాలో ఏడిఇగా విధులు నిర్వర్తిస్తున్నారు. వనస్థలిపురం, ఉప్పల్, ఇబ్రహీం పట్నం ప్రాంతాలకు చెందిన 17 మంది బంధువులతో కలిసి వారు మే 26న తిరుపతి వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు వెళ్లి తిరిగివస్తుండగా బుధవారం తెల్లవారు జామున కడపజిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వారి కుమారుడు అక్షిత్(6) అక్కడికక్కడే మృతి చెందగా శివసాయి, కిషన్, లక్ష్మి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వనస్థలిపురం టీవీ కాలనీకి చెందిన చందారమేష్ భార్య ధనలక్ష్మీ(40) తీవ్రంగా గాయపడి మృతి చెందగా, రమేష్‌కు గాయాలు అయ్యాయి. రమేష్ గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీలో హెచ్‌ఓడీగా పనిచేస్తుండగా ధనలక్ష్మీ స్థానికంగా బట్టల వ్యాపారం నిర్వహిస్తుంది. ధనలక్ష్మీ మృతితో వనస్థలిపురం సాయిటవర్స్‌లో విషాదం నెలకొంది.
నిద్ర వస్తోందని డ్రైవర్ చెప్పినా..
బుధవారం వేకువజామున 4.30 గంటల సమయంలో టెంపో ట్రావెలర్ దువ్వూరు సమీపంలోని పుల్లారెడ్డిపేట పెట్రోల్ బంకు వద్దకు చేరుకుంది. డీజల్ తక్కువగా ఉందని డ్రైవర్ చెప్పడంతో పట్టించుకోమని చెప్పడంతో అతను వాహనం ఆపాడు. డీజల్ పట్టించుకున్న తర్వాత డ్రైవర్ భాను కొంత సేపు పడుకున్నాడు. నిద్రలేపిన వారు బయలుదురుదామని చెప్పడంతో అతను ‘నిద్ర వస్తోంది సార్.. కొద్దిసేపు పడుకుంటాను.. మూడు రోజుల నుంచి కంటిన్యూగా డ్రైవింగ్ చేస్తున్నాను అలసటగా ఉంది ’అని చెప్పాడు. అయితే గత నెల 26న ఇంటి నుంచి బయలుదేరిన వారు 30న రాత్రికి ఇంటికి చేరుకునేలా టూర్ ప్లాన్ చేసుకున్నారు.
అయితే ఆలస్యం కావడంతో 31 వరకూ దారిలోనే ఉండాల్సి వచ్చింది. బుధవారం విధులకు వెళ్లాల్సి ఉండటంతో ఆఫీసు సమయానికి ఎలాగైనా హైదరాబాద్‌కు వెళ్లాలని డ్రైవర్‌పై ఒత్తిడి తెచ్చారు. దీంతో డ్రైవర్ భాను వారి మాట కాదనలేక ప్రయాణం సాగించాడు. కానగూడూరులోని పూల మార్కెట్ సమీపంలో టెంపో ట్రావెలర్ పక్కన ఉన్న ఇసుక ట్రాక్టర్‌ను ఢీ కొనడంతో గాఢ నిద్రలో ఉన్న సగం మంది ఇసుకలో కూరుకుపోయారు. వీరిలో ఊపిరి ఆడకపోవడంతో సాయి యోజిత్, అక్షిత్‌కుమార్, గ్రీష్మా అనే చిన్నారులు మృతి చెందారు. అదే సమయంలో నవాజ్ చేసుకునేందుకు మసీదుకు వచ్చి ముస్లింలు సహాయక చర్యలు చేపట్టారు. ఇసుకలో కూరుకొని పోయిన వారిని బయటికి తీసి ఆస్పత్రికి తరలించారు.
విషాదం నింపిన రోడ్డు ప్రమాదం
హైదరాబాద్‌లోని ఇబ్రహీంపట్నంకు చెందిన పొట్టుముత్తు శ్రీనివాసులు మెడికల్ షాపు నిర్వహించేవాడు. అతని కోరిక మేరకు బంధువులందరూ గత నెల 26న హైదరాబాద్ నుంచి టెంపో ట్రావెలర్ వాహనంలో తీర్థ యాత్రలకు బయల్దేరారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఆయన సోదరి ధనలక్ష్మి, చిన్నబావ వెంకటేశ్వర్లు, కొడుకు సాయియోజిత్ ఉన్నారు. అతని తమ్ముడు కిషన్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. కిషన్ కుమారుడు అక్షిత్ కుమార్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడటంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.