జంక్షన్.. నో టెన్షన్ | Free Journey signal In Hydebad City! | Sakshi
Sakshi News home page

జంక్షన్.. నో టెన్షన్

Published Mon, Mar 7 2016 2:19 AM | Last Updated on Sun, Sep 3 2017 7:09 PM

జంక్షన్.. నో టెన్షన్

జంక్షన్.. నో టెన్షన్

విశ్వనగరంలో ‘సిగ్నల్ ఫ్రీ జర్నీ
ఆటంకాల్లేని సాఫీ ప్రయాణానికి సర్కారు కసరత్తు
ఇప్పటికే టెండర్లు పిలిచిన ప్రభుత్వం
ఒప్పందాలు పూర్తి కాగానే పనులు మొదలు
సాక్షి, హైదరాబాద్: విశ్వనగరం.. సిగ్నల్ ఫ్రీ జర్నీ.. ఎక్కడికక్కడ మల్టీలెవెల్ ఫ్లై ఓవర్లు.. ఎలాంటి సిగ్నల్ ఆటంకాలు లేకుండా సాఫీ ప్రయాణం.. గత కొంతకాలంగా నగర ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తున్న అంశాలివీ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏడాదిగా విశ్వనగరం.. సిగ్నల్ ఫ్రీ జర్నీ.. గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది.

ఈ పనులకు సంబంధించి ఇప్పటికే కొన్నింటికి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. అగ్రిమెంట్లు కాగానే పనులు ప్రారంభం కానున్నాయి. అసలు సిగ్నల్ ఫ్రీ అంటే ఏమిటి..? దానికోసం ఏం చేస్తారు..? తద్వారా ప్రజలకు ఎలాంటి సదుపాయాలు కలుగుతాయి..? ప్రయాణ భారం ఎంత తగ్గుతుంది..? ఎంత సమయం కలిసొస్తుంది..? తదితర ప్రశ్నలు ఇప్పుడు అందరి మదినీ తొలిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘సిగ్నల్ ఫ్రీ’ జర్నీ కోసం చేపట్టనున్న పనుల గురించి ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం..‘సిగ్నల్ ఫ్రీ’ అంటే ఏమిటి..?
ఎక్కడైనా రెండు లేదా అంతకుమించి రోడ్ల కూడలిని దాటాలంటే ట్రాఫిక్ సిగ్నళ్లను చూసుకుని దాటాల్సిన విషయం తెలిసిందే. నగరంలో రెండు కి.మీ.ల మేర ప్రయాణించాలంటే దాదాపు నాలుగైదు చోట్ల సిగ్నళ్ల వద్ద ఆగాల్సిందే. దీనికితోడు సిగ్నళ్ల వద్ద రెడ్ లైట్ పడగానే ఒక్కసారిగా నిలిచిపోయిన ట్రాఫిక్‌తో రద్దీ పెరిగి.. గ్రీన్ సిగ్నల్ పడినా సాఫీగా ముందుకు వెళ్లలేని పరిస్థితి.

ఇలా.. ఐదు కి.మీ.ల దూరం ప్రయాణించాలన్నా దాదాపు అరగంట పట్టేస్తోంది. అదే సిగ్నల్ ఫ్రీ వ్యవస్థ ఉంటే.. ఈ అవస్థలు ఉండవు. సిగ్నల్ ఫ్రీ పనుల్లో భాగంగా మూడు, నాలుగు రోడ్ల కూడళ్ల వద్ద వాహనాలు ఆగకుండానే వెళ్లేందుకు వివిధ వరుసల్లో అదనపు మార్గాలు(అండర్‌పాస్/ఫస్ట్ లెవెల్ ఫ్లైఓవర్/ సెకెండ్ లెవెల్ ఫ్లైఓవర్/థర్డ్ లెవెల్ ఫ్లైఓవర్) నిర్మించనున్నారు. తద్వారా ఒకవైపు నుంచి ముందుకు వెళ్లాల్సిన వాహనాలు అండర్‌పాస్‌ల గుండా కానీ, ప్రధాన రహదారి నుంచి కానీ వెళతాయి. అదే ఎడమ వైపునకు వెళ్లాల్సిన వాహనాలు ఒక వరుస(ఫస్ట్ లెవెల్) ఫ్లైఓవర్ మీద నుంచి వెళతాయి. కుడి వైపునకు వెళ్లాల్సిన వాహనాలు ఇంకో వరుస(లెవెల్) ఫ్లైఓవర్ నుంచి వెళతాయి. ఆయా జంక్షన్ల వద్ద పరిస్థితుల్ని బట్టి అవసరమైన అండర్‌పాస్, ప్రధాన రహదారి, ఫస్ట్ లెవెల్ ఫ్లైఓవర్, సెకెండ్ లెవెల్ ఫ్లైఓవర్, థర్డ్ లెవెల్ ఫ్లైఓవర్, ఫ్రీ లెఫ్ట్ ఏర్పాట్లు క ల్పిస్తారు.
 
అగ్రిమెంట్లు పూర్తికాగానే పనులు మొదలు..
విశ్వనగర పనుల్లో భాగంగా సిగ్నల్ ఫ్రీ రహదారులకు టెండర్లు పిలిచిన ప్రభుత్వం.. గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు మూడు ప్రాంతాల్లో శంకుస్థాపనలు చేసింది. అగ్రిమెంట్లు పూర్తయితే పనులు మొదలు కానున్నాయి. గ్రేటర్‌లో సిగ్నల్ ఆటంకాల్లేకుండా ప్రయాణానికి అవసరమైన ఫ్లైఓవర్లు, మల్టీలెవెల్ గ్రేడ్ సెపరేటర్లు, జంక్షన్ల అభివృద్ధి తదితర పనులకు దాదాపు రూ. 20,600 కోట్లు ఖర్చవుతుందని తొలుత అంచనా వేశారు.

తొలిదశలో భాగంగా 18 ప్రాంతాల్లో రూ. 2,631 కోట్ల పనులకు టెండర్లు పిలిచారు. అప్పట్లో అమలు చేయాలనుకున్న యాన్యుటీ విధానాన్ని రద్దు చేసి ఈపీసీ విధానంలో ఐదు ప్యాకేజీల్లో ఆహ్వానించారు. అందులోనూ భూసేకరణ ఇబ్బందులు తదితరాలను పరిగణనలోకి తీసుకుని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, క్యాన్సర్ హాస్పిటల్, ఉప్పల్, రసూల్‌పురా, బహదూర్‌పురా జంక్షన్ల వద్ద పనుల్ని ఉపసంహరించుకున్నారు. దీంతో అంచనా వ్యయం రూ. 889 కోట్లకు తగ్గింది.
 
ప్రస్తుతం అభివృద్ధి చేయనున్న 13 జంక్షన్లు ఇవే
కేబీఆర్ పార్కు ప్రవేశద్వారం జంక్షన్, మహారాజ అగ్రసేన్ జంక్షన్(రోడ్ నం.12 జంక్షన్), ఫిల్మ్‌నగర్ జంక్షన్, రోడ్ నంబర్ 45 జంక్షన్, ఎల్‌బీనగర్ ఇంటర్‌సెక్షన్, బైరామల్‌గూడ ఇంటర్‌సెక్షన్, కామినేని హాస్పిటల్ ఇంటర్‌సెక్షన్, చింతలకుంట చెక్‌పోస్టు జంక్షన్, ఒవైసీ హాస్పిటల్ జంక్షన్, బయోడైవర్సిటీ పార్కు జంక్షన్, అయ్యప్ప సొసైటీ జంక్షన్, రాజీవ్‌గాంధీ విగ్రహం జంక్షన్, మైండ్‌స్పేస్ జంక్షన్.
 
కేబీఆర్ పార్కు జంక్షన్ వద్ద..
* టీఆర్‌ఎస్ కార్యాలయం వైపు నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వైపు ప్రధాన రోడ్డుపై నుంచే వెళ్లవచ్చు.
* జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వైపు నుంచి టీఆర్‌ఎస్ కార్యాలయం వైపు వెళ్లేందుకు ఫస్ట్ లెవెల్ ఫ్లైఓవర్ నిర్మిస్తారు.
* పంజాగుట్టవైపు నుంచి చెక్‌పోస్టు వైపు సెకండ్ లెవెల్ ఫ్లైఓవర్ ఏర్పాటు చేస్తారు.
* జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు నుంచి పంజాగుట్ట వైపు ఫ్రీ లెఫ్ట్ ఉంటుంది.     
* టీఆర్‌ఎస్ కార్యాలయంవైపు నుంచి పంజాగుట్టవైపు ప్రధాన రహదారి మీదుగానే వెళ్లవచ్చు. ప్రవేశద్వారం నుంచి జూబ్లీ చెక్‌పోస్టు, రోడ్ నం.45వైపు వెళ్లే ఈ మార్గాలను 4+4 లేన్లతో, మిగతా మార్గాలను 3+3 లేన్లతో అభివృద్ధి చేయనున్నారు.
 
సిగ్నల్ ఫ్రీ అందుబాటులోకి వస్తే..
 సిగ్నల్ ఫ్రీ పనులు పూర్తయితే వాహనాల ప్రయాణ వేగం 20 కేఎంపీహెచ్ నుంచి 35 కేఎంపీహెచ్‌కు పెరుగుతుంది. ఇంధన వినియోగం, వాతావరణ కాలుష్యం, వాహన నిర్వహణ ఖర్చు తగ్గుతుంది. ఇవన్నీ ఒక ఎత్తయితే.. సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోవడం ద్వారా మానసిక ఒత్తిడి తగ్గుతుందని డాక్టర్లు చెబుతున్నారు. పొరుగు జిల్లాల నుంచి నగర శివార్లకు చేరుకునేందుకు రెండు గంటలు పడితే.. శివార్ల నుంచి నగరంలోకి వచ్చేందుకు పడుతున్న గంటన్నర నుంచి రెండు గంటల సమయం కూడా తగ్గుతుందని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement