చంపేస్తున్నాయ్..!
► విద్యుత్‌షాక్‌కు అమాయకులు బలి
► ఫ్యూజ్ బాక్సులు, ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణ అస్తవ్యస్తం
► కంచెలేని ఫ్యూజ్ బాక్సులు, ట్రాన్స్‌ఫార్మర్లు
► తాజాగా నాచారంలో ఓ బాలుడి మృతి
సాక్షి, సిటీబ్యూరో: మొన్న మోతీనగర్...నిన్న పూల్‌బాగ్, సికింద్రాబాద్...తాజాగా నాచారం...ఇలా నగరంలో రోజూ ఎవరో ఒకరు విద్యుత్ కారణంగా మృతి చెందుతూనే ఉన్నారు. ఆయిల్ లీకేజీలు, అధికభారం వల్ల నిత్యం చరచరమంటూ నిప్పులు కక్కుతున్న ట్రాన్స్‌ఫార్మర్లకు, ఫ్యూజ్ బాక్సులకు కంచె, ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయక పోవడంతో తెలియక అటుగా వెళ్లిన వారు విద్యుత్‌ఘాతానికి గురవుతున్నారు. తాజాగా ఆదివారం నాచారంలో వీధిలో ఆడుకుంటున్న ఓ బాలుడు ప్రమాదవశాత్తూ ప్యూజ్ బాక్స్‌లోని విద్యుత్ వైర్లకు తగిలి మృత్యువాతపడటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇలా అమాయకులు చస్తున్నా...విద్యుత్ అధికారుల తీరులో మాత్రం మార్పురావడం లేదు.
బెంగుళూర్‌లో అలా..
బెంగళూర్ ఎలక్ట్రిసిటీ సప్లయ్ కంపెనీ లిమిటెడ్ ప్రమాణాల మేరకు ఎల్‌టీ ఏఈ డిస్ట్రిబ్యూషన్ బాక్సులు 2 ఎంఎం మెటల్ స్టీల్‌తో తయారు చేసి, బస్‌బార్లు(ఎంసీసీబీ)పై ఏర్పాటు చేసింది. తక్కువ స్థలంలో ఎవరికీ ఆటంకం కలుగకుండా తక్కువ ఖర్చుతో బిగించారు. ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. దీని వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం లేదు. బాక్స్‌లో మోల్డెన్‌కేస్ సర్క్యూట్ బ్రేకర్లను ప్రమాణాలకు తగ్గట్టుగా డ్రెస్సింగ్‌లో ఉన్నాయి. దీంతో ఇవి కాలిపోయే అవకాశాలు కూడా చాలా తక్కువ. ఓవర్ లోడ్‌ను తట్టుకునే విధంగా రైల్వే వారు అనుసరించిన ఎలక్ట్రిఫికేషన్ జీఐ స్వ్కేర్‌ట్యూబ్స్ స్ట్రక్చర్‌ను వినియోగించారు.
హైదరాబాద్‌లో ఇలా..
నగరంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ఒక్కో చోట ఒక్కో విధంగా అమర్చారు. కొన్ని చోట్ల దిమ్మలపై ట్రాన్స్‌ఫార్మర్లు ఉంచారు. మరి కొన్ని చోట్ల నేలపై బిగించారు. ప్రమాదమని తెలిసినా స్తంభానికి ఫ్యూజ్ బాక్సులు ఏర్పాటు చేశారు. నిర్దిష్ట ప్రమాణాలు లేకుండా ఎత్తు, పట్టింపుల్లేకుండా వాటిని బిగించేశారు. ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసినప్పటికీ..చాలా చోట్ల చెత్తకుప్పులు పేరుక పోయాయి. ఫ్యూజ్‌బాక్సుల్లో మందం వైర్లను ఉపయోగిస్తున్నారు. వీటి వల్ల లోడు ఎక్కువైనప ్పుడు ట్రాన్స్ ఫార్మర్ పూర్తిగా కాలిపోయే ప్రమాదం ఉంది.
యూజీ కేబుల్ వర్క్స్‌ను వేగవంతం చేయాలి
ముంబై, చెన్నై, బెంగళూరు తదితర మెట్రో నగరంలో 40 శాతం భూగర్భలైన్లు ఉంటే..అదే హైదరాబాద్‌లో మాత్రం 10 శాతం కూడా పూర్తి కాలేదు. భూగర్భ లైనింగ్ పనులను వేగవంతం చేయాలి. కరెంట్ స్తంభాలకు ఇంటర్నెట్ కేబుల్స్ అమర్చుతుండటంతో అవి సాలేగూళ్లను తలపిస్తున్నాయి. - నక్కా యాదగిరి, అధ్యక్షుడు, తెలంగాణ ప్రైవేటు ఎలక్ట్రికల్స్ అసోసియేషన్.