టాలీవుడ్‌తోనూ నయీం లింకులు ! | Gangster Nayeem had Links with tollywood | Sakshi
Sakshi News home page

టాలీవుడ్‌తోనూ నయీం లింకులు !

Published Fri, Aug 12 2016 7:51 PM | Last Updated on Tue, Oct 16 2018 9:08 PM

టాలీవుడ్‌తోనూ నయీం లింకులు ! - Sakshi

టాలీవుడ్‌తోనూ నయీం లింకులు !

గ్యాంగ్‌స్టర్ నయీం తెలుగు సినీ పరిశ్రమలోనూ కొందరితో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం తెలుగు సినీ పరిశ్రమలోనూ కొందరితో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ‘రక్తచరిత్ర’తో స్ఫూర్తి పొందిన నయీం స్వీయ చరిత్రనూ తెరకెక్కించాలని భావించినట్లు సమాచారం. నయీంకు చెందిన డెన్స్ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న డైరీల్లోని ఓ దాంట్లో దీనికి సంబంధించిన విషయాలు ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. రాజకీయాలపై ఆసక్తితో ఉన్న నయీం భువనగిరి అసెంబ్లీ సీటుపై కన్నేసినట్లు ఇప్పటికే వెలుగులోకి వచ్చింది. ఈ సన్నాహాల్లో భాగంగానే ఈ సినిమానూ ఓ ప్రచారాస్త్రంగా వాడుకోవాలని భావించాడని తెలిసింది.

నెగెటివ్ ఇమేజ్ తగ్గించుకునేందుకు...
కరుడుగట్టిన నేరగాడైన నయీంకు మాజీ మావోయిస్టుగా, గ్యాంగ్‌స్టర్‌గానే పేరుంది. ఇతడి ఆగడాలు, చేసిన దారుణాలకు అంతే లేకపోవడంతో స్థానికంగానూ నయీం అంటే భయంతో పాటు చెడ్డపేరూ ఉంది. ఇవి ఇలానే కొనసాగితే రాజకీయాల్లో అడుగుపెట్టడం, రాణించడం కష్టమంటూ నయీంకు ‘సన్నిహితులు’ సలహా ఇచ్చారు. దీంతో నెగెటివ్ ఇమేజ్‌ను పొగొట్టుకునే ప్రయత్నాల్లో భాగంగానే భువనగిరి నియోజకవర్గంలోని 30 వార్డుల్లో 30 వాటర్‌ప్లాంట్స్ నిర్మాణానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఈ నేపథ్యంలోనే నయీం దృష్టి రాయలసీమ ఫ్యాక్షనియం ప్రధానంగా వచ్చిన ‘రక్తచరిత్ర’ చిత్రాలపై పడింది. అదే మాదిరిగా తన స్వీయచరిత్రను తెరకెక్కించాలని భావించాడు. నయీం గతంలో జూబ్లీహిల్స్‌లోని ఓ క్లబ్‌కు తరచుగా వెళ్ళేవాడు. ఇది సినీ ప్రముఖులు ఎక్కువగా వచ్చేది కావడంతో అక్కడే పరిచయమైన వారిని ద్వారానే చిత్రీకరించడానికి నిర్ణయించుకున్నాడని సమాచారం.

నెగెటివ్ లేకుండా పాజిటివ్‌గా...
ఈ చిత్రంలోనూ తనలోని నెగెటివ్ షేడ్స్ కాకుండా పాజిటివ్ అంశాలనే చూపించి, వాటినే ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని నయీం భావించాడు. తన భూకబ్జాలు, దందాలు వంటి నేర జీవితాన్ని మినహాయించి మావోయిస్టుగా తాను చేసిన పనులు, ఉద్యమం నుంచి బయటకు వచ్చాక మావోయిస్టు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్లతో పాటు పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా పని చేసినప్పుడు తన ద్వారా అధికారులు సాధించిన ‘సక్సెస్’లు మాత్రమే తెరకెక్కించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. దీనికోసం తాన డైరీల్లో రాసుకున్న అనేక కీలకాంశాలను నెమరు వేసుకున్నాడని సమాచారం. తెలుగు సినీరంగానికి చెందిన రెండోస్థాయి దర్శకులు ఇద్దరితో నయీం సంప్రదింపులు జరిపాడు. చిత్ర నిర్మాణానికి అవసరమైన నిధులు తానే ఇస్తానని, సినిమా తీయాలంటూ వారిని కోరినట్లు తెలిసింది. 2019లో రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని భావిస్తున్న నేపథ్యంలో 2018 ద్వితీయార్థం లేదా 2019 ప్రథమార్ధంలో ఈ చిత్రం విడుదలయ్యేలా నయీం ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది.

అక్కడా ఓ ‘పోలీసు’తో పరిచయం...
ఈ‘ నయీం కీ కహానీ’తో కూడిన చిత్ర నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక చర్చలు గోవాలో నయీంకు ఉన్న కోకోనట్ గెస్ట్‌హౌస్‌లో జరిగాయని తెలిసింది. సదరు దర్శకులతో కలిసి రోడ్డు మార్గంలో అక్కడకు వెళ్ళిన నయీం మూడు రోజుల పాటు చర్చించాడు. ఈ సందర్భంలో నయీంతో పాటు ఓ మహిళ కూడా కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం.

సదరు దర్శకుల్లో ఒకరి సలహా మేరకే పోలీసులు గుర్తుపట్టకుండా ఉండేందుకు వేషం మార్చడం, మేకప్ కిట్స్ వినియోగించడం, మేకప్ చేసుకోవడం వంటివి ప్రారంభించినట్లు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. సినీ రంగంతో మంచి పరిచయాలు ఉన్న ఓ మాజీ పోలీసు ఉన్నతాధికారితో ఆ సందర్భంలోనే నయీంకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత కొన్నాళ్ళ పాటు ఈ పరిచయం కొనసాగిందని తెలుస్తోంది. సదరు పోలీసు అధికారికి నయీంతో ఉన్న సంబంధాలు ఏమిటి? అనే అంశంపై పోలీసు వర్గాలు దృష్టిపెట్టి కూపీ లాగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement