
టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో అమలుకు పోరు: గట్టు
టీఆర్‌ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ ప్రత్యక్ష పోరాటాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధం అవుతుందని వైఎస్సార్ సీపీ
త్వరలో భారీ ధర్నా.. 27న రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశం
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ ప్రత్యక్ష పోరాటాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధం అవుతుందని వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. బుధవారం లోటస్‌పాండ్‌లోని కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాక ముందు ప్రజల బతుకులు ఎలా ఉన్నాయో.. ఇప్పుడూ అలాగే ఉన్నాయని తెలిపారు. కేసీఆర్ పాల నలో తెలంగాణ ప్రజల ఆశలు నిరాశల య్యాయని వాపోయారు. రాష్ట్రంలో 90 శాతానికి పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు బాగుపడకుండా సమగ్రాభివృద్ధి ఎలా సాధ్యమని చెప్పారు. బీసీ, మైనార్టీలపై ప్రేమ ఉంటే వారికోసం ఉపప్రణాళిక చట్టం తీసుకురావాలని కోరారు.
విద్యారంగ సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే భారీ ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో 22 లక్షల మందికి ఇళ్లు లేవని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు 2 లక్షల ఇళ్లు కట్టిస్తామంటున్నారని మిగిలిన ఇళ్లు సకాలంలో పేదలకు కట్టించకపోతే నిద్రపోనీ యమన్నారు. ప్రాజెక్టుల పేరిట రైతుల భూముల్ని అన్యాయంగా లాక్కొంటే చూస్తూ ఊరుకోమన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం, ఆత్మహత్యలు, శ్రమదోపిడీ ఇప్పటికీ కొన సాగుతున్నాయన్నారు. తాను కమ్యూనిస్టునే అంటున్న కేసీఆర్.. తాను తీసుకొనే నిర్ణయా లను కూడా కమ్యూనిస్టు పార్టీల సమావేశాల్లో చర్చించినట్లుగా చర్చించి, ప్రజలకు లబ్ధి చేకూర్చే నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుం దని హితవు పలికారు.
టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో ప్రజల ముందు పెట్టి, ఎన్నింటిని అమలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పుడు ఆయనకు ప్రజల రియాక్షన్ ఏంటో తెలుస్తుం దన్నారు. టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోలోని అంశా లను అమలు చేయాలని కోరుతూ త్వరలో భారీ ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కె. శివకుమార్, జి. రాంభూపాల్ రెడ్డి, జె. మహేందర్ రెడ్డి, మతీన్ ముజాద్దాదీ, బోయినపల్లి శ్రీనివాస్ రావు, జీహెచ్‌ఎంసీ శాఖ అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్ రెడ్డి, వరంగల్ జిల్లా ఇన్‌చార్జ్ వేముల శేఖర్ రెడ్డి, డాక్టర్స్ విభాగం అధ్య క్షుడు డాక్టర్ ప్రఫుల్లా రెడ్డి పాల్గొన్నారు.
27న వైఎస్పార్ సీపీ నాయకుల భేటీ
ఈ నెల 27న సోమవారం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం లో ముఖ్య నేతల భేటీ నిర్వహిస్తున్నట్లు గట్టు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లాల ఇన్‌చార్జ్‌లు, జిల్లా అధ్యక్షులు, అసెంబ్లీ కో ఆర్డినేటర్లు, అనుబంధ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు తరలి రావాలని కోరారు.