జీహెచ్‌ఎంసీ వార్డుల రిజర్వేషన్లు ఖరారు!
హైదరాబాద్: వచ్చే నెల మూడోవారంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నడంతో అధికార పార్టీ టీఆర్‌ఎస్ ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందుగానే జీహెచ్ఎంసీ వార్డుల రిజర్వేషన్లపై దృష్టిసారించింది. ఈ మేరకు శుక్రవారం వార్డుల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్‌రిజర్వ్‌డ్ 44, బీసీ - 50, ఉమెన్ జనరల్- 44, ఎస్సీ-10, ఎస్టీ-2 కాగా, మొత్తం 150 సీట్లలో సగం సీట్లు మహిళలకే రిజర్వేషన్లను ప్రకటించినట్టు పేర్కొంది.
ఇటీవలి కాలంలో టీఆర్‌ఎస్ క్యాడర్ పెరిగినప్పటికీ, గ్రేటర్‌లో స్థానికంగా క్షేత్రస్థాయిలో పెద్దగా బలం లేదు. ఎలాగైనా జీహెచ్‌ఎంసీపై జెండా ఎగరేయాలనేది లక్ష్యం. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు పూర్తిగా స్థానిక సమస్యలపై ఆధారపడ్డవి కావడంతో ప్రజల్లో నమ్మకం కలిగించేందుకే వ్యూహాత్మకంగా వందరోజుల టార్గెట్‌ను అమలుచేయాలని తొలుత భావించారు. స్వచ్ఛ భారత్‌ను కూడా ఎన్నికలకు అనుకూలంగా మలచుకునేందుకు దీంతోపాటే ఇతర అంశాలనూ జోడించారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.