అంపశయ్యపై 3,600 పాఠశాలలు
అదో మారుమూల గ్రామం. ఆ ఊరిలో ఒక బడి. ఊరి పిల్లలంతా ఆ బడికే వెళ్లేవారు. కాలం తిరిగింది. ఊరు మారింది. అవసరాలు మారాయి. చదువులు మారాయి. పోటీతత్వం పెరిగింది. ఒక్కటేమిటీ? కాలచక్రంలో పడి అన్నీ మారిపోయాయి. బడి మాత్రం అలాగే ఉంది. అందులో చదువులూ అలాగే ఉన్నాయి! మారని ఆ బడి.. తన బిడ్డ భవిష్యత్తును ఎలా మారుస్తుందని ఓ తండ్రి ఆలోచించాడు. ఆ బడి మాన్పించి ప్రైవేటు బడి చూసుకున్నాడు. ఇందులో తప్పెవరిది?
కాలానికి అనుగుణంగా బడిని మార్చని సర్కారుదా?
బిడ్డకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకున్న తండ్రిదా?
అదో ప్రభుత్వ బడి. 70 మంది పిల్లలు. ఒకే టీచరు. తెలుగు, లెక్కలు, సామాన్య, సాంఘికశాస్త్రం.. అన్నీ ఆ ఒక్కరే చెప్పాలి. ఒంట్లో బాగోలేకో, ఇంట్లో పనుండో ఓ రోజు టీచర్ సెలవు పెట్టాడు. అంతే.. ఆ రోజు స్కూలుకు సెలవు! పిల్లలంతా బడికి వచ్చి వెనక్కి వెళ్లిపోయారు. ‘ఇదేం బడి? ఆయనేం సారు? ఎప్పుడొస్తారో తెలియదు. ఎప్పుడు రారో తెలియదు..’ అంటూ ఇంట్లో తల్లి విసుక్కుంది! అదే స్కూలుకు ఇంకో టీచర్ ఉండి ఉంటే ఆ బడి నడిచేది!
ఆ తల్లి మాటల్లో నిజం లేదా?
ఇంకో టీచర్‌ను ఇచ్చి బడి నడిపే బాధ్యత ప్రభుత్వానికి లేదా?
నరేశ్ చిన్నప్పట్నుంచే కాన్వెంట్‌లో చదివాడు. సురేశ్ తెలుగు మీడియంలో చదివాడు. నరేశ్‌కు ఇప్పుడు ఓ కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది. జీవితంలో స్థిరపడ్డాడు. సురేశ్‌కు ఉద్యోగం రాక ఊళ్లోనే ఏవో పనులు చేసుకుంటున్నాడు. తమ పిల్లలకు కూడా నరేశ్‌లాంటి చదువులే కావాలని కోరుకుంటున్నారు నేటితరం తల్లిదండ్రులు. మాతృభాషతోపాటు ఇంగ్లిష్ కూడా కావాలని వారు కోరుకోవడం అత్యాశ కాదు కదా..!
ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం ఎందుకు పెట్టరు?
సర్కారీ బడులు ప్రైవేటు స్కూళ్లతో ఎందుకు పోటీ పడవు?
అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న గిరిజన తండా అది. అక్కడ పది మంది పిల్లలతో స్కూలు నడుస్తోంది. ఇన్నాళ్లూ ఆ స్కూలుకు భవనం, తాగునీరు, టాయిలెట్ వంటి కనీస వసతుల ఊసెత్తని ప్రభుత్వానికి ఇప్పుడు హఠాత్తుగా ఓ విషయం గుర్తొచ్చింది. స్కూల్లో తక్కువ మంది పిల్లలు ఉన్నారట.. దాన్ని మూసేసి మరో స్కూల్లో కలిపేస్తారట! బస్సు వసతి కూడా లేని పక్క ఊరికి పంపలేక ఆ పది మంది పిల్లల్ని అసలు బడే మాన్పించాలని చూస్తున్నారు తల్లిదండ్రులు. ఇదొక్కటే కాదు. రాష్ట్రంలో ఇలాంటి అనేక పాఠశాలల్ని మూసేస్తామంటోంది సర్కారు.
ఉన్నచోటే ఆ స్కూళ్లను బలోపేతం చేస్తే 10 మంది పిల్లలు కాస్తా 20 మంది కారా?
మూసేస్తే ఆ స్కూళ్లలోని వేల మంది పిల్లల చదువులు ప్రశ్నార్థకం కావా?
ఐదేళ్లు నిండాకే ప్రభుత్వ బడిలో చేర్పించాలి. కానీ ఈ నిబంధనకు కాలం చెల్లిందంటున్నారు తల్లిదండ్రులు. మూడేళ్ల నుంచే చదివిస్తామంటూ ఆర్థిక భారమైనా పిల్లల్ని ప్రైవేటు స్కూళ్లలో చేర్పిస్తున్నారు. ఇలా బుడిబుడి అడుగుల ప్రాయంలోనే పిల్లలంతా ‘ప్రైవేటు’ వైపు మళ్లడంతో సర్కారీ బడుల్లో ఏటా 50 వేల నుంచి లక్ష మంది పిల్లలు తగ్గిపోతున్నారు.
పేరెంట్స్ ఆశలకు అనుగుణంగా ఐదేళ్ల నిబంధన ఎందుకు మార్చరు?
అంగన్‌వాడీ కేంద్రాలను ప్రైమరీ స్కూళ్ల పరిధిలోకి ఎందుకు తేలేరు?
ప్రభుత్వం తలచుకుంటే ఇవేమైనా అసాధ్యమైనా పనులా?
....ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా.. ప్రాథమిక స్థాయిలోనే ప్రభుత్వ విద్యా వ్యవస్థ చుట్టూ ముసురుకున్న సమస్యలు ఎన్నో. సమాధానం లేని ప్రశ్నలు మరెన్నో. ప్రభుత్వ బడుల్లో చదువు కరువు. ప్రైవేటు స్కూళ్లలో కరెన్సీ బరువు. సర్కారీ పంతుళ్ల బోధన పై నిఘా ఉండదు.. ప్రైవేటు యాజమాన్యాల అడ్డగోలు ఫీజులపై నియంత్రణ ఉండదు. చెట్టు కింద చదువులు ఓచోట.. ఏసీ గదుల్లో చదువులు మరోచోట..! కొందరు పిల్లలకు ర్యాంకుల గొప్పలు.. మరికొందరికి అసలు చదువుకే తిప్పలు..! వెరసి పునాదుల్లోనే అల్లుకుంటున్న అంతరాలు. పాఠశాల విద్యా వ్యవస్థ ఆసాంతం అస్తవ్యస్తం!
రాష్ట్రంలో పాఠశాల విద్య దుస్థితిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు రేపటి నుంచి..