జీపీఎఫ్ ఖాతాల్లో పీఆర్‌సీ బకాయిలు | GPF accounts in PRC arrears | Sakshi
Sakshi News home page

జీపీఎఫ్ ఖాతాల్లో పీఆర్‌సీ బకాయిలు

Published Wed, May 11 2016 12:27 AM | Last Updated on Sun, Sep 3 2017 11:48 PM

జీపీఎఫ్ ఖాతాల్లో పీఆర్‌సీ బకాయిలు

జీపీఎఫ్ ఖాతాల్లో పీఆర్‌సీ బకాయిలు

పెన్షన్‌దారులు, ఖాతాల్లేని ఉద్యోగులకు నగదు  సీఎం సూచనతో మళ్లీ ఫైలు సిద్ధం చేసిన ఆర్థిక శాఖ
సాక్షి, హైదరాబాద్: పీఆర్‌సీ బకాయిలను ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) ఖాతాల్లో జమ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. పది నెలలుగా ఈ బకాయిల ఊసెత్తకుండా పెండింగ్‌లో పెట్టిన ప్రభుత్వం.. ఈ ఫైలును సిద్ధం చేయాలని తాజాగా ఆర్థిక శాఖకు పురమాయించింది. సీఎం కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలతో పీఆర్‌సీ బకాయిల చెల్లింపులకు ఎంత మొత్తం అవసరం..

జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేసేందుకు ఎంత మొత్తం అవసరం, కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌లో ఉన్న కొత్త ఉద్యోగులకు నగదు చెల్లింపులకు ఎన్ని నిధులు అవసరమవుతాయనే తదితర వివరాలతో ఆర్థిక శాఖ మరోసారి ఈ ఫైలును సిద్ధం చేసినట్లు తెలిసింది. దీంతో బకాయిల చెల్లింపులపై త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశముందని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. బకాయిలను నగదు రూపంలో చెల్లిస్తారా..? జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తారా..? అనే తర్జన భర్జనలతో ఏడాదికి పైగా ప్రభుత్వం ఈ చెల్లింపులను ఆపేసింది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి రాకుండా బాండ్ల రూపంలో చెల్లించాలనే ప్రత్యామ్నాయాన్ని పరిశీలించింది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నుంచి వ్యతిరేకత రావటంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది.
 
బకాయిల మొత్తం రూ. 2,800 కోట్లు
గత ఏడాది మార్చి నుంచి పీఆర్‌సీ వేతన సవరణను అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం 2014 జూన్ నుంచి 2015 ఫిబ్రవరి వరకు 9 నెలలకు సంబంధించిన బకాయిలను ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది. వీటిని ఒకేసారి చెల్లించాలంటే దాదాపు రూ. 2,800 కోట్లు అవుతుందని ఆర్థిక శాఖ అంచనాకు వచ్చింది. వీటిలో జీపీఎఫ్ ఖాతాలున్న ఉద్యోగులకు రూ.1,300 కోట్లు జమ చేయాలి. జీపీఎఫ్ ఖాతాల్లేని కొత్త ఉద్యోగులు, పెన్షన్‌దారులకు ఇవ్వాల్సిన గ్రాట్యుటీ బకాయిలకు రూ.1,500 కోట్లు కావాలని ఆర్థిక శాఖ ఇప్పటికే అంచనా వేసింది.

బకాయిల చెల్లింపులు ఇప్పటికే ఆలస్యమయ్యాయని, జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయాలని ఇటీవల ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సీఎంను కలసిన సందర్భంగా విజ్ఞప్తి చేశారు. దీంతో జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేసేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎం ఆర్థిక శాఖకు సూచించినట్లు తెలిసింది. మరోవైపు ముందుగా జీపీఎఫ్ ఖాతాలున్న వారికి బకాయిలు జమ చేసి.. తర్వాత పెన్షన్‌దారులు, సీపీఎస్ ఖాతాలున్న కొత్త ఉద్యోగులకు నగదు రూపంలో చెల్లించాలనే ప్రతిపాదన సైతం అధికారుల పరిశీలనకు వచ్చినట్లు సమాచారం. కానీ ఆలస్యమైనప్పటికీ అందరికీ బకాయిలను ఒకేసారి చెల్లింపులు చేయాలనే  తుది నిర్ణయానికి వచ్చారు. ఫైలును పంపించిన తర్వాత సీఎం నుంచి తుది నిర్ణయం వచ్చేంత వరకు తొందరపడవద్దని నిర్ణయించుకున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement