‘గ్రేటర్’లో ఉత్కంఠ
సాక్షి, సిటీబ్యూరో: కేంద్ర మంత్రిమండలి తెలంగాణ నోట్‌కు ఆమోదం తెలిపిన నేపథ్యంలో పలు చర్చలు జోరుగా సాగాయి. జీహెచ్‌ఎంసీలో ఎలాంటి మార్పులు జరగనున్నాయనే దానిపై గురువారం ఉద్యోగులు, సిబ్బందిలో ఉత్కంఠ నెలకొంది. నగరంలోని ప్రజలకు వివిధ రకాల సేవలందిస్తున్న జీహెచ్‌ఎంసీలో దాదాపు పది వేల మంది రెగ్యులర్ ఉద్యోగులున్నారు. వీరిలో ఉన్నతాధికారుల్లో ఎక్కువమంది డిప్యుటేషన్లపై పనిచేస్తుండటంతో వారంతా ఇక ఇక్కడే ఉంటారా? వారి ప్రాంతాలకు వెళ్లిపోతారా? అనే చర్చలు మొదలయ్యాయి.
కీలక పోస్టుల్లోని కమిషనర్, అడిషనల్, జోనల్ కమిషనర్ల పోస్టుల్లో ఇప్పటి వరకు తెలంగాణ వారికి తగిన ప్రాధాన్యం లేదనే ఆరోపణలున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం కావడంతో తమ పరిస్థితేమిటనే యోచనలో తెలంగాణేతర అధికారులున్నారు. ఏ రాష్ట్రంలో ఉండాలో నిర్ణయించుకునే వెసులుబాటు ఉన్నా.. ఎటు మొగ్గు చూపాలో చెప్పే పరిస్థితి లేదని సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా, జీహెచ్‌ఎంసీలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌పై పని చేస్తున్నవారు దాదాపు 20 వేల మంది వరకు ఉన్నారు. తమ ఉద్యోగాలు ఇక రెగ్యులర్ అవుతాయన్న ఆనందం తెలంగాణకు చెందిన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. తెలంగాణ నోట్ ఆమోదంపై జీహెచ్‌ఎంసీలో మిశ్రమ స్పందన కనిపించింది.