‘గ్రిడ్’ సంగతేంటి? | 'Grid' about? | Sakshi
Sakshi News home page

‘గ్రిడ్’ సంగతేంటి?

Published Wed, Dec 3 2014 12:06 AM | Last Updated on Sat, Sep 2 2017 5:30 PM

‘గ్రిడ్’ సంగతేంటి?

‘గ్రిడ్’ సంగతేంటి?

‘ఔటర్’ చుట్టూ సాధ్యం కాదు
సాంకేతికంగా సమస్యలు
ప్రత్యేక భూ సేకరణే మేలు
హెచ్‌ఎండీఏ అభ్యంతరాలు

 
సిటీబ్యూరో: ప్రభుత్వం ఓ కొత్త ప్రాజెక్టు చేపట్టేందుకు ముందుకు వచ్చిందంటే ఏం చేయాలి? సంబంధిత అధికారులు సాధ్యాసాధ్యాలపై సరైన నివేదికలివ్వాలి. భవిష్యత్తు పరిణామాలనూ ఊహించగలగాలి.  అందుకు తగ్గట్టుగా సక్రమంగా దిశా నిర్దేశం చేయాలి. అలా కాకుండా ఏలికల మెప్పు కోసం ప్రయత్నిస్తే ఏమవుతుంది? కొత్త వివాదాలకు...
 
‘వాటర్ గ్రిడ్’ ఏర్పాటుకు ఇటీవల జలమండలి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇలాగే ఉంది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో ప్రభుత్వం మౌలిక సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా నగరం చుట్టూ ‘వాటర్ గ్రిడ్’ను నిర్మించాలని నిర్ణయించింది.  నివేదిక  రూపొందించాలని జ ల మండలిని ఆదేశించింది. సంబంధిత అధికారులు ప్రాథమికంగానైనా సర్వే చేయకుండానే ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని చుట్టూ 160 కి.మీ. మేర వాటర్ గ్రిడ్ (ట్రంక్ లైన్)ను ప్రతిపాదిస్తూ నివేదిక సిద్ధం చేశారు. ఔటర్   వెంట వాటర్ గ్రిడ్ ఏర్పాటు సాధ్యమేనా? క్షేత్ర  స్థాయిలో ఎదురయ్యే ఇబ్బందులేంటి? తగినం త భూమి ఉందా? అన్న విషయాలపై హెచ్‌ఎండీఏతో సంప్రదించకుండానే ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారనే వాదనలు వినిపిస్తున్నా యి. ఇది ఇరు విభాగాల మధ్య వివాదాలకు ఆజ్యం పోసినట్టయింది. ఔటర్ చుట్టూ తమకు   4 మీటర్ల మేర స్థలం కేటాయిస్తే చాలని...  గ్రిడ్ ఏర్పాటు చేస్తామని జలమండలి అధికారులు ఇటీవల సీఎం వద్ద పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఔటర్ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డును కలుపుతూ ప్రతిపాదించిన 33 రేడియల్ రోడ్ల వెంట పైపులైన్లు వేసి నగరమంతటికీ నీటిని సరఫరా చేస్తామని చెప్పారు.  
 
అది కష్టమే

ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని చుట్టూ వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని హెచ్‌ఎండీఏ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా స్థలం కేటాయించనందున ఇతర నిర్మాణాలకు వీలు లేదని, ప్రత్యేకించి పైప్‌లైన్‌ను నిర్మిస్తే మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ‘నిజానికి ఔటర్ ప్రధాన రహదారిని ఆనుకొని అవసరాల కోసం ఇరువైపులా 4 మీటర్ల మేర స్థలమే విడిచిపెట్టాం. ఇందులో ఎలక్ట్రికల్, టెలిఫోన్ కేబుళ్లతో పాటు గ్యాస్ పైపులైన్‌లకే అవకాశం ఉంది. దానిపక్కనే పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ (రైల్ కారిడార్) కోసం 25 మీటర్ల మేర స్థలం కేటాయించాం. ఆ రెండింటి మధ్యలో (యుటిలిటీస్ ప్రాంతంలో)వాటర్ పైపులైన్ వేస్తే భవిష్యత్‌లో మరిన్ని అనర్థాలకు దారితీస్తుంది. విద్యుత్ అంతరాయంతో పైపులైన్‌లో తరచూ జరిగే హెచ్చుతగ్గుల వల్ల ఒక్కోసారి పైపు పగిలి బ్లో అవుట్ మాదిరిగా నీరు ఎగజిమ్మే ప్రమాదం ఉంది. దీనివల్ల ఔటర్ ప్రధాన మార్గానికి నష్టం వాటిల్లడమే గాక, పక్కనే ఉన్న రైల్ కారిడార్‌కు కూడా ప్రమాదం వాటిల్లుతుంది. ఇది ప్రాణ నష్టానికి కూడా దారి తీయవచ్చు’ అని ఓఆర్‌ఆర్ అధికారులు చెబుతున్నారు. కృష్ణా నీటిని నగరానికి తెచ్చే క్రమంలో పైపులైన్‌ను ఇబ్రహీంపట్నంను బైపాస్ చేసి శెరిగూడ మీదుగా బొంగుళూరు వద్ద ప్రధాన రహదారికి కలిపారు. దీనివల్ల దూరంతో పాటు నిర్మాణ వ్యయం కూడా తగ్గింది. ఇదే విధానాన్ని వాటర్ గ్రిడ్ విషయంలో అనుసరించాలని అంటున్నారు. భవిష్యత్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వాటర్ గ్రిడ్ కోసం ప్రత్యేకంగా భూమిని సేకరించి పైపులైన్ వేస్తే మేలని హెచ్‌ఎండీఏ అధికారులు సూచిస్తున్నారు.
 
ఇదీ నిర్వాకం
 
నగర శివారులోని బొంగుళూరు నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు (నెం.25) వరకు రేడియల్ రోడ్డును అద్భుతంగా నిర్మించారు. ఆ మార్గంలో బి.ఎన్.రెడ్డి నగర్ వరకు మంచినీటి పైపులైన్ కోసం జ లమండలి తవ్వకాలు జరిపింది. ఫలితంగా ఆ రోడ్డు అధ్వానంగా తయారైంది. పైపులైన్ వే శాక ప్రమాణాల మేరకు పూడ్చకపోవడంతో రో డ్డు దిగబడిపోయి దారుణంగా తయారైంది.  జలమండలి దీన్ని పట్టించుకోలేదని... ఔటర్‌ను ఆనుకొని పైపులైన్ వేసేందుకు అనుమతిస్తే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఎక్స్‌ప్రెస్ హై వేకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్‌ఎండీఏ గట్టిగా వ్యతిరేకిస్తోంది. ఈ పంచాయతీ త్వరలో సీఎం వద్దకు వెళ్లనుందని విశ్వసనీయంగా తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement