కీలక రైల్వే ప్రాజెక్టుల్లో నిలిచిపోయిన పనులు
- ట్రాక్ మరమ్మతులు, బ్రిడ్జి నిర్వహణకూ బ్రేక్
- పది రోజులుగా ఆందోళన చేస్తున్న కాంట్రాక్టర్లు
- ముందు ప్రాజెక్టులకు పాత పన్నే ఉండాలని డిమాండ్
- రూ.5,600 కోట్ల విలువైన పనులకు ఆటంకం
సాక్షి, హైదరాబాద్: దక్షిణ, మధ్య రైల్వేలో ఈ ఏడాది చేపట్టిన ప్రాజెక్టులన్నీ దాదాపు నిలిచిపోయాయి. రోజువారీగా చేపట్టవలసిన ట్రాక్‌లు, బ్రిడ్జీల నిర్వహణ సహా అత్యవసర పనులకు బ్రేకులు పడ్డాయి. వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) అమలుకు ముందు ఒప్పందం కుదుర్చుకున్న ప్రాజెక్టులన్నింటికీ పాత పన్ను విధానమే అమలు చేయాలని, పాత ప్రాజెక్టులకు జీఎస్‌టీ ప్రకారం 18 శాతం పన్ను చెల్లించబోమని కాంట్రాక్టర్లు ఎక్కడికక్కడ పనులను నిలిపివేసి ఆందోళనకు దిగారు. ఇప్పటి వరకు చేపట్టిన పనులకు సైతం బిల్లులు తీసుకోకుండా పనులు నిలిపివేయడంతో దక్షిణ, మధ్య రైల్వేలో 90 శాతానికి పైగా పనులకు ఆటంకం ఏర్పడింది.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అక్కన్నపేట–మెదక్, మనోహరాబాద్–నిజామాబాద్, కాజీపేట్–బల్లార్ష, కాజీపేట్–విజయవాడ వంటి కీలక ప్రాజెక్టులు నిలిచిపోయాయి. కొత్త రైల్వేలైన్ల నిర్మాణం, డబ్లింగ్, విద్యుదీకరణ, రైల్ ఓవర్ బ్రిడ్జీలు, రైల్ అండర్ బ్రిడ్జీల వంటి సుమారు రూ.5,600 కోట్ల విలువైన పనులను కాంట్రాక్టర్లు ఆపేశారు. ఇండియన్ రైల్వే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 10 రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. దక్షిణ, మధ్య రైల్వే పరిధిలోని 6 డివిజన్లలో ప్రాజెక్టులు చేపట్టిన 1,500 మంది కాంట్రాక్టర్లు పనులను నిలిపివేసి ఆందోళనకు మద్దతు తెలిపారు.
ఎంఎంటీఎస్–2 కు బ్రేక్..
హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎంఎంటీఎస్ రెండో దశను వచ్చే డిసెంబర్ నాటికి పట్టాలెక్కించాలని అనుకున్నప్పటికీ కాంట్రాక్టర్ల ఆందోళనతో మరింత సమయం పట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు ప్రధాన పనులు జరుగుతున్నప్పటికీ వివిధ మార్గాల్లో అంతర్గతంగా పూర్తి చేయవలసిన ఆర్‌ఓబీలు, ఆర్‌యూబీల నిర్మాణం ఆగిపోయింది. వీటితో పాటు కాజీపేట్, విజయవాడ, గుంటూరు, గుంతకల్ తదితర ప్రాంతాల్లోనూ ఆర్‌యూబీలు, ఆర్‌ఓబీలకు బ్రేకులు పడ్డాయి. ఇక నడికుడి–శ్రీకాళహస్తి, గుల్బర్గా–బీదర్ మూడో లైన్, కాజీపేట్–బల్లార్ష, కాజీపేట్–విజయవాడ, మనోహరాబాద్–నిజామాబాద్ వంటి ప్రాజెక్టులు ఆగిపోయాయి.
రోజువారీ రైళ్ల రాకపోకల దృష్ట్యా చేపట్టవలసిన అత్యవసర ట్రాక్, బ్రిడ్జీల మరమ్మతు పనులపైనా ఈ ఆందోళనల ప్రభావం పడింది. ఈ పనులు చేసే ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని ఇచ్చేందుకు పలువురు కాంట్రాక్టర్లు వెనకడుగు వేయడంతో పరిమితంగా ఉన్న రైల్వే సిబ్బందే ట్రాక్ నిర్వహణ పనులను చేపడుతున్నారు. ఇటీవల పలు చోట్ల ప్రమాదాలు చోటుచేసుకోవడం.. భారీ వర్షాలు ట్రాక్‌లను ముంచెత్తుతున్న పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు పనులను నిలిపివేయడం ఇబ్బందికరంగా మారిందని రైల్వే ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు.
జీఎస్‌టీతో గందరగోళం..
జూలై 1 నుం చి అమల్లోకి వచ్చిన జీఎస్‌టీ రైల్వేలో గందరగోళం సృష్టించింది. జీఎస్‌టీ ప్రకారం అన్ని రైల్వే ప్రాజెక్టులపై 18 శాతం పన్ను విధించారు. పాత పన్ను విధానం ప్రకారం రైల్వేలో చేపట్టే పనులకు అన్ని ప్రాజెక్టులపై 5 శాతం వ్యాట్ అమలయ్యేది. దీనికి మరో 2 శాతం వరకు బిల్డింగ్ సెస్, ఇన్‌కమ్‌ట్యాక్స్ సెస్ ఉండేది. జీఎస్‌టీతో ఇది ఏకంగా 18 శాతానికి పెరిగింది. పైగా జూన్ 30 నాటి వరకు కుదుర్చుకున్న ఒప్పందాలను జీఎస్‌టీ పరిధిలోకి తేవడంతో సమస్య మొదలైంది. అప్పటి వరకు పూర్తి చేసిన పనులకు నిధులు చెల్లించేందుకు రైల్వే సిద్ధంగా ఉన్నప్పటికీ వాటిని తీసుకునేందుకు కాంట్రాక్టర్లు వెనుకంజ వేశారు. ఆ బిల్లులు తీసుకుంటే 18 శాతం జీఎస్‌టీ చెల్లించవలసి ఉంటుంది. దీన్ని కాంట్రాక్టర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
పరిష్కరించే వరకు పనులు చేపట్టబోం..
జీఎస్‌టీ అమలు కంటే ముందు అగ్రిమెంట్ కుదుర్చుకున్న ప్రాజెక్టులకు 18 శాతం, 12 శాతం చొప్పున పన్నులు విధిస్తామంటే ఎలా. దానివల్ల మేము భారీగా నష్టపోవలసి వస్తుంది. పాత ప్రాజెక్టులను జీఎస్‌టీ పరిధిలోకి తేవద్దనేదే మా ప్రధాన డిమాండ్. ఈ సమస్యను పరిష్కరించే వరకు పనులు చేపట్టబోం.
– అఫ్సర్ రియాజ్, ఇండియన్ రైల్వే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు