
హైదరాబాద్: కేసీఆర్ కుటుంబ పాలనలో పౌర, ప్రజాస్వామిక హక్కుల ఉల్లంఘన రోజురోజుకూ తీవ్రమవుతోందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. గురువారం హైదరాబాద్ హైదర్‌గూడ ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 20న పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ విద్యార్థి సంఘం తలపెట్టిన రాష్ట్ర మహాసభలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం అడ్డుకుందన్నారు. రాష్ట్ర సాధన కోసం పోరాడిన తెలంగాణ విద్యార్థి సంఘం మహాసభలను అడ్డుకోవడమంటే అమరుల త్యాగాలను అవమానించడమేనని అన్నారు.
పెద్దపల్లి జిల్లాలో 144 సెక్షన్‌ను ఎత్తివేసి మహాసభలు సజావుగా జరిగేలా చూడాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థి ఉద్యమాలపై ప్రభుత్వం అమలు చేస్తున్న నిర్బంధకాండను మానుకుని, విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఆయన కోరారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వ అధీనంలోకి తీసుకుని చెరకు రైతులను, కార్మికులను ఆదుకోవాలని, ఎర్రజొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఆదివాసీ గూడేలపై అటవీశాఖ చేస్తున్న దాడులు ఆపాలని హరగోపాల్ డిమాండ్ చేశారు. సమావేశంలో బండి దుర్గాప్రసాద్, పీడీఎం.రాజు, అరుణాంక్ తదితరులు పాల్గొన్నారు.