హైదరాబాద్ : స్విస్ ఛాలెంజ్ పిటిషన్పై గురువారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును ఈ నెల 12న వెల్లడించనుంది. ఆంధ్రప్రదేశ్ తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ప్రపంచస్థాయి నగర నిర్మాణం కోసమే స్విస్ ఛాలెంజ్ పద్ధతి పాటిస్తున్నట్లు చెప్పారు. అయితే రెవెన్యు వివరాలు ఎందుకు వెల్లడించలేదని హైకోర్టు ఈ సందర్భంగా ప్రశ్నించింది.
మొదటే వెల్లడిస్తే ప్రాజెక్టు నిర్మాణానికి అవరోధాలు కలుగుతాయని ఏజీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి పనులకు ప్రభుత్వం స్విస్ చాలెంజ్ విధానాన్ని ఎంచుకోవడాన్ని సవాలు చేస్తూ ఆదిత్య కన్స్ట్రక్షన్స్, చెన్నైకు చెందిన ఎన్వీఎన్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే పిటిషన్ దాఖలు చేసిన సంస్థలకు అంత అనుభవం లేదని ఏజీ తెలిపారు.