హైకోర్టు ఆక్షేపించిన తప్పులనేకం
సరిదిద్దుకోవడానికి సర్కారుకు అవకాశం
కానీ తమ చర్యలను సమర్థించుకున్న రాష్ట్ర ప్రభుత్వం
అడ్డుగా, ఇబ్బందిగా ఉన్న అన్ని అంశాలకు సవరణలు
చట్టం అడ్డుతొలగించుకుని ఆర్డినెన్స్ జారీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి పనులకు సంబంధించి స్విస్ చాలెంజ్ పద్ధతి కింద సింగపూర్ కంపెనీల కన్సార్టియం సమర్పించిన ప్రతిపాదన.. పరిశీలన మొదలు, టెండర్ నిబంధనల వరకు అనుసరించిన విధానంలో ప్రభుత్వం చేసిన అనేక తప్పులను హైకోర్టు ఎత్తిచూపింది. ఎక్కడెక్కడ చట్ట విరుద్ధంగా వ్యవహరించారో సింగిల్ జడ్జి చెప్పారు. తప్పులను సరిదిద్దుకోవాలంటూ ప్రభుత్వానికి అవకాశమిచ్చారు.
అయితే తప్పులను సరిదిద్దుకోవాల్సిన ప్రభుత్వం మాత్రం ఆ పని చేయలేదు. స్విస్ చాలెంజ్ వ్యవహారంలో తమ చర్యలను సమర్ధించుకునేందుకు ఏకంగా చట్ట సవరణకే దిగింది. ఏపీఐడీఈ చట్టంలో ఏ ఏ అంశాలు తమకు అడ్డుగా, ఇబ్బంది ఉన్నా యో వాటిని చట్ట సవరణ ద్వారా తొలగించడమో, మార్చడమో చేసేసింది. తద్వారా భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం జాగ్రత్త పడిందన్నమాట.
సింగిల్ జడ్జి తప్పుబట్టిన కీలక అంశాలివీ..
** సింగపూర్ కన్సార్టియం తన ప్రతిపాదనల్లో పేర్కొన్న ఆదాయ వివరాలను ప్రాథమిక స్థాయిలో బహిర్గతం చేసి తీరాలి. అలా చేయకపోవడం చట్ట విరుద్ధమే. అసలు ఆదాయ వివరాలు ‘యాజమాన్య సమాచారం’ ఎంత మాత్రం కాదు. సింగపూర్ కన్సార్టియం అడిగింది కాబట్టి అది యాజమాన్య సమాచారం అవుతుందనడం ఎంత మాత్రం సరికాదు.
** కన్సార్టియం ప్రతిపాదించిన ఆదాయ వివరాలు ప్రభుత్వానికి గానీ, సీఆర్‌డీఏ అధికారులకు గానీ తెలియకుంటే, అసలు ఆ ప్రతిపాదనలన్నీ రాష్ట్రానికి ప్రయోజనకరమనే నిర్ణయానికి ఎలా రాగలరు.? సింగపూర్ కన్సార్టియం ప్రతిపాదనలేవీ తెలియకుండానే, రూ.3 వేల కోట్ల విలువైన భారీ ప్రాజెక్టు కోసం స్విస్ చాలెంజ్ పద్దతిన మాస్టర్ డెవలపర్ ఎంపిక ప్రక్రియను మొదలుపెట్టడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధం.
** ఏపీఐడీఈ చట్టంలోని సెక్షన్ 19–2 ప్రకారం మొదట ప్రధాన ప్రతిపాదికుడు తమ ప్రతిపాదనలను స్థానిక ఏజెన్సీ అయిన సీఆర్‌డీఏకు సమర్పించాలి. ఆ ప్రతిపాదనలను చూసి ప్రధాన ప్రతిపాదకుడికి ఆ ప్రాజెక్టు చేపట్టే అర్హత, సామర్థ్యం ఉన్నాయో తెలుసుకోవాలి. తరువాత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ పరిశీలన చేయాలి. ఆ తరువాత ప్రభుత్వానికి సిఫారసులు వెళ్లాలి. అయితే ప్రస్తుత కేసులో మొత్తం వ్యవహారం ‘రివర్స్’లో జరిగింది.
** కన్సార్టియం మొదట తమ ప్రతిపాదనలను నేరుగా ప్రభుత్వానికే సమర్పించింది. తరువాత ప్రభుత్వం నుంచి హైపవర్ కమిటీకి వెళ్లాయి. (హైపవర్ కమిటీ ఏర్పాటును చట్టం చెప్పలేదు). ఆ తరువాత సీఆర్‌డీఏకు అక్కడి నుంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అథారిటీకి చేరి, మళ్లీ అక్కడి నుంచి ప్రభుత్వానికి వెళ్లాయి.
** ఈ రివర్స్ విధానం వల్ల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ స్వతంత్రత ప్రభావితమైంది. ప్రభుత్వం ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చినప్పుడు, దానికి విరుద్ధంగా వెళ్లేందుకు సీఆర్‌డీఏ, ఇన్‌ఫ్రా అథారిటీ వంటి అధికార సంస్థలు ఇబ్బంది పడుతాయి. పాలనలో ఇది ప్రత్యక్ష అనుభవమే. ఈ మొత్తం వ్యవహారంలో ఇన్‌ఫ్రా అథారిటీ స్వతంత్రంగా వ్యవహరించాల్సి ఉంది. అయితే వాస్తవానికి అలా జరగనే లేదు.
** చట్ట నిబంధనల ప్రకారం రాష్ట్రానికి వచ్చే వాణిజ్యపరమైన ప్రయోజనాలను అధికారులు ముందు చూడాలి. ఆ తరువాతే స్విస్ చాలెంజ్ విధానాన్ని అనుసరించాలి. కాని అధికారులు అందుకు విరుద్ధమైన విధానాన్ని అనుసరించారు. మొదట స్విస్ చాలెంజ్ విధానాన్ని అనుసరించి, ఆ తరువాత వాణిజ్యబిడ్‌లను పరిశీలిస్తామంటున్నారు. ఇది ‘గుర్రానికి ముందు బండి ఉంచడమే’. ఇది విధానపరమైన అవకతవక మాత్రమే కాదు.. ప్రజా ప్రయోజాలను ప్రమాదంలో నెట్టి వేయడమే అవుతుంది.
** ఈ మొత్తం వ్యవహారంలో అనుసరించిన విధానాన్ని చూస్తే ఏ అధికారి కూడా సహేతుకంగా, నిష్పాక్షికంగా చట్ట నిబంధనలకు లోబడి వ్యవహరించలేదు. తక్కువ వ్యయంతో కూడుకున్న ‘రాజీ’ నిబంధనలను పక్కనపెట్టి, వ్యయంతో కూడిన లండన్‌లోనే కూర్చొని చేసే మధ్యవర్తిత్వ క్లాజ్‌ను ప్రభుత్వం ఆమోదించింది.
** నోటిఫికేషన్‌లో నిర్దేశించిన అర్హతల విషయానికొస్తే, ‘భారతదేశం వెలుపల అనుభవం’ అన్న నిబంధన పక్షపాతంతో కూడుకున్నది. ఈ ప్రాజెక్టు విస్తృతిని దృష్టిలో పెట్టుకుని, సాంకేతికంగా, ఆర్థికంగా సింగపూర్ కన్సార్టియంతో సరితూగే లేదా వారి కన్నా ఎక్కువ అర్హతలున్న వారికే పనులు అప్పగించాలన్న ఉద్దేశంతోనే ఈ అర్హతలు నిరే్ధశించినట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ వాదన ఎంత మాత్రం సహేతుకంగా లేదు.
** ఈ కేసులో తన హక్కులకు భంగం కలుగుతుందని పిటిషనర్లు భావించారు కాబట్టే కోర్టుకు వచ్చారు. తుది విచారణలో అర్హతల, నిబంధనల చట్టబద్దత తేలుతుంది. ఈ కేసులో ప్రభుత్వం, సీఆర్‌డీఏ వాదనలు ఎలా ఉన్నాయంటే ‘ఆసక్తి’ ఉన్న దరఖాస్తుదారులు అంటే.. బిడ్డింగ్‌కు అర్హత ఉన్న వారు మాత్రమే.. అన్న అర్థంలో ఉన్నాయి. ఆసక్తి ఉన్న వారు అంటే అర్హత లేని వారు అని కాదు. ఆసక్తి ఉన్న వ్యక్తి అర్హత లేకపోయినా బిడ్ దాఖలు చేయవచ్చు. బిడ్ దాఖలు చేసిన తరువాత అర్హత ఉందా? లేదా? తేలుతుంది. కాబట్టి వారికి కోర్టును ఆశ్రయించే అర్హత, ఈ కేసులో జోక్యం చేసుకునే అర్హత లేదనడం సరికాదు.
ఏపీఐడీఈ చట్టానికి ప్రభుత్వం చేసిన కీలక సవరణలివీ
ఏపీఐడీఈ చట్టంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఐడీఏ)కు అత్యంత ప్రాధాన్యత ఉంది. సింగిల్ జడ్జి తప్పుబట్టిన అనేక అంశాలు ఇన్‌ఫ్రా అథారిటీతో ముడిపడి ఉండటంతో ప్రభుత్వం ఆ అ«థారిటీని నామమాత్రం చేయాలని నిర్ణయించి అందుకనుగుణంగా ఏపీఐడీఈ చట్టానికి సవరణలు చేసింది. ఈ చట్టం ఏ విషయాల్లో అయితే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అథారిటీకి విస్తృత అధికారాలు కల్పిస్తుందో, ఎక్కడెక్కడ ఈ అథారిటీని సంప్రదించాలని ఉందో, ఆ విషయాలన్నింటిలో ఇన్‌ఫ్రా అథారిటీ అన్న పేరును తొలగించి దాని స్థానంలో‘ప్రభుత్వం’ అన్న పదాన్ని చేర్చింది.
** ఏదైనా ప్రాజెక్టు విషయంలో సలహాలు, సూచనలు, సిఫారసులు చేసే అధికారం ఇక ఇన్‌ఫ్రా అథారిటీకి ఉండదు. అలాగే ప్రాజెక్టు అమలు విషయంలో ప్రభుత్వ రంగ సంస్థలకైనా, డెవలపర్‌కైనా తగిన ఆదేశాలు జారీ చేసే అధికారం కూడా ఇకపై ఇన్‌ఫ్రా అథారిటీకి ఉండదు.
** సమావేశాలు నిర్వహించే అధికారం కూడా అథారిటీకి ఉండదు. అథారిటీకి పలు అధికారాలు కల్పిస్తున్న ఏపీఐడీఈ చట్టంలోని 11, 12 సెక్షన్‌లను చట్ట సవరణ ద్వారా తొలగించింది.
** డెవలపర్ తన హక్కులను దుర్వినియోగం చేస్తే అందుకు దుర్వినియోగ చార్జీలు విధించి, ఆ డెవలపర్‌పై కఠిన చర్యలు తీసుకునే అధికారం ఇన్‌ఫ్రా అథారిటికీ ఉండదు. డెవలపర్‌కు జరిమానా విధించే అధికారం కూడా అథారిటీకి లేకుండా సవరణలు చేసింది.
** ఏపీఐడీఈ చట్టంలో రాజీ క్లాజులే వర్తించకుండా ఉండేలా ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. రాజీ క్లాజుకు ఇరుపక్షాలు కూడా అంగీకరించకుంటే ఏపీఐడీఈ చట్టంలోని చాప్టర్ 5, 6 (రాజీ విధి విధానాలు) వర్తించవంటూ చట్టాన్ని సవరించింది. దీంతో అధిక వ్యయంతో కూడిన మధ్యవర్తిత్వానికే వెళ్లడం తప్పనిసరి కానుంది.
** ఏపీఐడీఈ చట్టంలో ఆసక్తి ఉన్న వారందరూ బిడ్ దాఖలకు అర్హులని ఉండేది. చట్ట సవరణ ద్వారా ఆసక్తి ఉన్న వారందరూ అన్న పదాన్ని తొలగించి దాని స్థానంలో అర్హత ఉన్న వారే బిడ్ దాఖలు చేయగలరంటూ మార్చేసింది.