మరి ఇప్పుడేమంటావు చంద్రబాబు: అంబటి
హైదరాబాద్ : స్విస్ చాలెంజ్ విధానంపై రాష్ట్ర ప్రభుత్వం యూ టర్న్ తీసుకుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. అమరావతి నిర్మాణలను సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టి, లక్షలకోట్లు సంపాదించాలనేది సీఎం చంద్రబాబు లక్ష్యమని అయితే దాన్నే న్యాయస్థానాలు అడ్డుకున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. గురువారం అంబటి రాంబాబు పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... స్విస్ చాలెంజ్ అప్పీల్ నుంచి ప్రభుత్వం ఒక్కసారిగా ఉపసంహరించుకుందన్నారు.
ఈ విషయంలో కోర్టుకు వెళ్లినవారిని చంద్రబాబు ఉన్మాదులతో పోల్చారని, మరి కోర్టులో ఇప్పుడు పిటిషన్ ఎందుకు ఉపసంహరించుకున్నారని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఇప్పటికీ స్విస్ చాలెంజ్పై వెనక్కి తగ్గేది లేదని మంత్రి నారాయణ అంటున్నారని, అవసరం అయితే చట్టాలను మార్చి అయినా సింగపూర్ కంపెనీలతో దోచుకోవడమే సర్కార్ లక్ష్యంగా కనిపిస్తుందన్నారు. ఇప్పటికైనా చిత్తశుద్ధితో ప్రజా రాజధానిని నిర్మించాలని ఆయన సూచించారు.
పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు గడువుపై ఏపీ సర్కార్ స్పందించాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల స్పీకర్లు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని అన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు రానేరావని, బాబు తన కుటుంబ సభ్యుల్నే మోసగించారని, పార్టీ మారినవాళ్లో లెక్కా అని అంబటి అన్నారు.