రాజధానికి విదేశీ ‘దమ్ము’ | Heavy smuggling of overseas cigarettes | Sakshi
Sakshi News home page

రాజధానికి విదేశీ ‘దమ్ము’

Published Tue, Aug 15 2017 2:40 AM | Last Updated on Thu, Oct 4 2018 5:38 PM

రాజధానికి విదేశీ ‘దమ్ము’ - Sakshi

రాజధానికి విదేశీ ‘దమ్ము’

- భారీగా విదేశీ సిగరెట్ల అక్రమ రవాణా 
- ఓ ముఠాను పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు 
- రూ.19 లక్షల విలువైన సిగరెట్లు సీజ్‌
 
సాక్షి, హైదరాబాద్‌: బంగారం... ఎలక్ట్రానిక్‌ వస్తువులు... మాదకద్రవ్యాలు... అక్రమ రవాణా పేరు చెప్పగానే ఇవే గుర్తుకొస్తాయి. నగరానికి చెందిన కొన్ని ముఠాలు మాత్రం కొన్నాళ్లుగా సిగరెట్లను స్మగ్లింగ్‌ చేస్తున్నాయి. ఏటా రూ.వందల కోట్ల విలువైన సరుకు ‘దిగుమతి’చేసుకుంటూ ప్రభుత్వ ఖజానాకు భారీగా గండికొడుతున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఇలాంటి ఓ ముఠాను పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేసినట్టు డీసీపీ బి.లింబారెడ్డి సోమవారం వెల్లడించారు. వీరి నుంచి రూ.19 లక్షల విలువైన బంగ్లాదేశ్‌ తయారీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 
 
బంగ్లాదేశ్‌ టు సిటీ వయా మెట్రోస్‌... 
నగరానికి అక్రమ రవాణా అవుతున్న సిగరెట్లలో ప్యారిస్‌ బ్రాండ్‌కు చెందినవి ఎక్కువగా ఉన్నట్లు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గుర్తించారు. ఇవి తయారవుతున్నది బంగ్లాదేశ్‌లో. అక్కడ నుంచి నేరుగా కాకుండా... కోల్‌కతా, ఢిల్లీల మీదుగా రైలు మార్గంలో హైదరాబాద్‌కు వచ్చిపడుతున్నాయి. బేగంబజార్‌కు చెందిన మహ్మద్‌ హస్‌నుద్దీన్‌ ఈ అక్రమ సిగరెట్ల దందాలో ఆరితేరాడు. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి నుంచి వీటిని ఖరీదు చేస్తున్నాడు.

వివిధ రకాల పేర్లతో రైళ్లలో పార్సిల్‌ అవుతున్న వీటిని తన ఏజెంట్లు ఎజాజ్‌ అలీ, అలీ రజాల ద్వారా నాంపల్లి రైల్వేస్టేషన్‌ నుంచి బేగంబజార్‌కు తెప్పించుకుంటున్నాడు. ఒక్కో ప్యాకెట్‌ రూ.20కి ఖరీదు చేస్తున్న హస్‌నుద్దీన్‌... మార్కెట్‌లో రూ.30కి విక్రయిస్తుండగా... వినియోగదారులకు రూ.40కు చేరుతోంది. ఎక్కడా బిల్లులు లేకుండా ఈ దందా సాగడంతో ప్రభుత్వానికి పన్ను రూపంలో రావాల్సిన ఆదాయానికి గండి పడుతోంది. 
 
ఒకటికి ఒకటిన్నర డ్యూటీ... 
ఆరోగ్యానికి హానికరమైన, స్థానికంగా ఉండే వ్యాపారులను నష్టాన్ని తీసుకువచ్చే సిగరెట్ల దిగుమతిని ప్రభుత్వం ప్రోత్సహించట్లేదు. ఈ నేపథ్యంలోనే వీటిపై దిగుమతి సుంకం భారీగా విధిస్తోంది. ఈ సిగరెట్లపై ఒకటికి ఒకటిన్నర శాతం పన్ను విధిస్తారు. ఈ డ్యూటీని ఎగ్గొట్టడానికే బంగ్లాదేశ్‌ నుంచి అక్రమ మార్గంలో వస్తున్న సిగరెట్లను కోల్‌కతా, ఢిల్లీలకు చెందిన వ్యాపారులు దేశ వ్యాప్తంగా వివిధ నగరాలకు సరఫరా చేస్తున్నారు.  
 
ఇలా వెలుగులోకి..
సిటీ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఇటీవల గుట్కా వ్యాపారంపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ నుంచి రైలులో గుట్కా వస్తోందనే సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎల్‌.రాజావెంకటరెడ్డి నేతృత్వంలోని బృందం సోమవారం నాంపల్లి రైల్వేస్టేషన్‌ వద్ద కాపుకాసింది. ఎజాజ్, రజాలను పట్టుకుని వారు ఆటోలో తరలిస్తున్న పార్సిల్స్‌ను తనిఖీ చేయగా... రూ.19 లక్షల విలువైన 48 వేల ప్యారిస్‌ సిగరెట్లు బయటపడ్డాయి. ఆరా తీయగా... అక్రమ రవాణా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో వ్యాపారి హస్‌నుద్దీన్‌ కోసం అధికారులు గాలిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement