
సాక్షి, హైదరాబాద్: ఎమ్మార్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి, ఏపీ క్రీడలు, యువజన సర్వీసుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఎల్వీ సుబ్రమణ్యంకు హైకోర్టు ఊరటనిచ్చింది. ఎమ్మార్ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఆయనపై సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేసింది.
సుబ్రమణ్యంపై సీబీఐ చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని.. ఎమ్మార్‌కు భూకేటాయింపులు, ధర నిర్ణయం పూర్తిగా ప్రభుత్వా నిదేనని, అందులో ఏపీఐఐసీ ఎండీగా ఉన్న సుబ్రమణ్యానికి ఎలాంటి పాత్ర లేదని స్పష్టం చేసింది. మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలనే ఆయన అమలు చేశారని, ఈ కేసులో ఇతర నిందితులుగా ఉన్న వారికి ఎలాంటి ప్రయోజనం జరగలేదని పేర్కొంది. న్యాయ మూర్తి జస్టిస్ బి.శివశంకరరావు గురువారం తీర్పు వెలువరించారు.
అనుమతిలోనే పొరపాటు..
ఎమ్మార్ కేసులో సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రమణ్యం గతేడాది మార్చి 16న హైకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావు 169 పేజీల తీర్పు వెలువరించారు. సుబ్రమణ్యం ప్రాసిక్యూషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చేందుకు తిరస్కరించిందని.. కానీ కేంద్రం అనుమతిని చ్చిందని అందులో పేర్కొన్నారు.
ప్రాసి క్యూషన్‌కు అనుమతి నిరాకరిస్తూ రాష్ట్రం ఇచ్చిన ఉత్తర్వులు ఎందుకు సరికాదనే కారణాలు వివరించ కుండానే కేంద్రం అనుమతివ్వడం సరికాదన్నారు. అలా చేయడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని తెలిపారు. సీబీఐ ఇచ్చిన చార్జిషీట్‌లోని అంశాలనే పరిగణనలోకి తీసుకుంటూ సుబ్రమణ్యం ప్రాసిక్యూషన్‌కు కేంద్రం అనుమతి ఇచ్చిందన్నారు. ఇక ఎమ్మార్ భూకేటాయింపుల్లో సుబ్రమణ్యం స్వీయ నిర్ణయాలు ఎక్కడా లేవని.. కేబినెట్ నిర్ణయాలనే అమలు చేశారని స్పష్టం చేశారు.
చాముండేశ్వరినాథ్‌కు విల్లా కేటాయింపుల్లో సుబ్రమణ్యం సిఫార్సు చేసినట్లుగా సీబీఐ ఎటువంటి ఆధారాలూ చూపలేకపోయిందని తేల్చారు. ప్రాజెక్టు అమలయ్యే నాటికి ఆయన పదవిలో లేరని స్పష్టం చేస్తూ.. సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేశారు.