రోడ్లకు ఇక మహర్దశ
రూ. 3,806 కోట్లు కేటాయింపు
►రూ. 400 కోట్లతో మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రెండులేన్లు
►గ్రామ రహదారులకు రూ. 2 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: కొంతకాలంగా మరమ్మతులు లేక అస్తవ్యస్తంగా తయారైన రోడ్లను మెరుగుపరచడంతోపాటు, కొత్తరోడ్ల నిర్మాణానికి టీఆర్‌ఎస్ సర్కార్ అధికప్రాధాన్యమిచ్చింది. ఐదునెలల స్వల్పకాలానికి ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌లో రోడ్లకోసం రూ. 3,806 కోట్లను కేటాయించింది. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రెండులేన్ల రహదారుల నిర్మాణానికి రూ.400 కోట్లను కేటాయించింది. దక్షిణ భారతదేశంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే వెనుకబడిన తెలంగాణలో రోడ్డు నెట్‌వర్క్‌ను మెరుగుపరిచేందుకు రూ.2 వేల కోట్లను కేటాయించింది.
వచ్చే రెండేళ్లలో రూ.10 వేల కోట్లఖర్చుతో తెలంగాణలో రోడ్లను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం తొలివిడతగా రూ. 3,806 కోట్లను కేటాయిస్తున్నట్టు ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. రహదారుల అభివృద్ధికి ఉపముఖ్యమంత్రి రాజయ్య అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. తెలంగాణలో దాదాపు 1,300 గ్రామాలకు బస్సు వసతి లేకపోవడానికి సరైనరోడ్లు లేకపోవటమే కారణమని గుర్తించిన ప్రభుత్వం గ్రామీణ రోడ్లను మెరుగుపరిచేబాధ్యతను కూడా రోడ్లు భవనాల శాఖకు అప్పగించనుంది. పంచాయతీరాజ్ రోడ్ల కోసం రూ.2 వేల కోట్లు ఖర్చు చేయనుంది.
కేటాయింపులు ఈ విధంగా ఉన్నాయి...
►జిల్లాల పరిధిలో స్థానిక రహదారుల కోసం రూ.562 కోట్లు, గజ్వేల్ ప్రాంత అభివృద్ధి సంస్థతోపాటు మెదక్‌జిల్లాలో ఇతర అనుసంధాన రోడ్ల అభివృద్ధికి రూ.30 కోట్లు కేటాయింపు.
►రోడ్లపై అవసరమైన వంతెనల నిర్మాణానికి రూ.100 కోట్లు. తెలంగాణ రోడ్డు సెక్టార్ ప్రాజెక్టుకు రూ.192 కోట్లు, రైల్వే లైన్లపై వంతెనల కోసం రూ.111 కోట్లు కేటాయింపు.
► కొత్త రైల్వేలైన్ల నిర్మాణానికి రాష్ట్రప్రభుత్వ వాటా (50 శాతం) కోసం రూ.43 కోట్లు.
►తెలంగాణ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పరిధిలో కోర్‌రోడ్ల అభివృద్ధికి రూ.100 కోట్లు.
రోడ్డు రవాణాకు మొత్తం కేటాయింపులు రూ. 3,806 కోట్లు
ప్రణాళికేతర పద్దు కింద : రూ. 1,381 కోట్లు.
ప్రణాళిక పద్దు కింద : రూ. 2,425 కోట్లు