
హైదరాబా'దిల్'వాలే
సైనా బ్యాటూ... రామ్ చరణ్ ట్రీటూ, సానియా బిర్యాని...మహేష్‌తో బాతాఖానీ... నెలరోజులుగా సిటీలో బాలీవుడ్ సినిమా దిల్‌వాలే యూనిట్ చేయని సందడి లేదు. మన సిటీ టాలీవుడ్, స్పోర్ట్స్ సెలబ్రిటీలు ఈ టీమ్‌కు ఆతిథ్యం అందించేందుకు పోటీపడుతున్నారు. బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ తన సింప్లిసిటీతో సిటీ పీపుల్‌ని మెప్పిస్తున్నాడు.
ఇప్పటిదాకా బయటకు వచ్చిన ఈ తరహా మీటింగ్‌లలో... మన సిటీ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నె హ్వాల్ హయత్‌నగర్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి మరీ షారూఖ్‌తో ముచ్చట్లు పెట్టి ఆయనతో సెల్ఫీలు సైతం దిగిందనేది ఒకటి. ఈ మీటింగ్ కోసం షారూఖ్‌కు ఆమె ఆన్‌లైన్‌లో రిక్వెస్ట్ పెడితే ఆయన స్వయంగా సైనాకు ఫోన్ చేసి మరీ పిలిపించుకున్నారు. మన సిటీ స్పోర్ట్స్ స్టార్ సైనాని చూసి ఇన్‌స్పైర్ అయ్యాడో, లేక ఆమె గిఫ్ట్‌గా ఇచ్చిన బ్యాట్‌తో తన బ్యాడ్మింటన్ సత్తా పరీక్షించుకుందామనుకున్నాడో గాని సినిమా షూటింగ్ పూర్తయిన అనంతరం షారూఖ్ నెట్ కట్టేసి బ్యాడ్మింటన్‌లో మునిగి తేలుతున్నాడు.
ఈద్‌కు సానియా ఆతిథ్యం..
ఈద్ సందర్భంగా ఇంట్లో వండించిన బిర్యాని పంపి సానియా మీర్జా ఇచ్చిన ఆతిథ్యం దిల్‌వాలే యూనిట్‌కు సంతోషాన్ని వడ్డించింది. దీనిపై ఈ సినిమా నటీనటులు సానియాకు మనస్ఫూర్తిగా ట్వీటర్‌లో కృతజ్ఞతలు తెలిపారు. టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌చరణ్ తేజ్ సైతం దిల్‌వాలేలో మరో హీరో అయిన వరుణ్‌ధావన్‌ను ఇంటికి పిలిచి బిర్యానీ విందు వడ్డించాడు. మరోవైపు దిల్‌వాలే చిత్ర బృందం కూడా షూటింగ్ గ్యాప్‌లో మన టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబును రెండు దఫాలు కలిసింది. తాజాగా రామ్‌చరణ్ బ్రూస్‌లీ సినిమా షూటింగ్ స్పాట్‌కు వచ్చిన షారూఖ్... రామ్‌చరణ్ స్టెప్పులు చూసి ఫిదా అయిపోయాడు. సరదాగా రామ్‌తో స్టెప్పులేశారు బాద్ షా.
రోడ్లపై బైక్‌తో చక్కర్లు...
దిల్‌వాలే దర్శకుడు రోహిత్‌శెట్టి తనకు గిఫ్ట్‌గా ఇచ్చిన హార్లీ డేవిడ్సన్ బైక్ మీద షారూఖ్ సిటీలో చక్కర్లు కొడుతున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి తగ్గట్టే షూటింగ్ స్పాట్‌కు బైక్ మీద వెళ్లడం అంటే తనకెంతో ఇష్టమని, అలా రౌండ్స్ వేశాక చెదిరిపోయిన జుట్టును చూసుకోవడం కూడా సరదా అని ట్వీట్ చేశాడు షారూఖ్.
హైదరాబాద్‌లో షూటింగ్ చేసుకున్న గత హిందీ సినిమా యూనిట్లకు భిన్నంగా, దిల్‌వాలే యూనిట్ సందడి చేస్తోంది. మరికొన్ని రోజుల్లో ఇక్కడ షూటింగ్ పూర్తి చేసుకోనున్న ఈ సినిమా హైదరాబాద్‌కు తీపిగుర్తులు ఇంకెన్ని వదిలి వెళ్తుందో చూద్దాం... - సాక్షి, వీకెండ్ ప్రతినిధి