అవయవదానం చేసేందుకు సిద్ధం : డీజీపీ అనురాగ్ శర్మ
హైదరాబాద్: అవయవదానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు స్వయంగా అవయవదానం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ ప్రకటించారు. ఒక్కరు అవయవదానం చేయడం ద్వారా మరో ఎనిమిది మందికి ప్రాణంపోయొచ్చని తెలిపారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లో ఉన్న ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవయవదానంపై మీడియా, ప్రభుత్వం మరింతగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిఒక్కరూ అవయవదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
అవయవదాతలు లభించని కారణంగా రోగులు మృతిచెందే రోజు రాకూడదన్నారు. అవయవాలు తరలింపు సమయంలో తమశాఖ తరఫున ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే సాయం చేస్తున్నామన్నారు. ఇటీవల గుండె మార్పిడి సమయంలో ట్రాఫిక్‌ను కంట్రోల్ చేసిన తీరును తెలిపే ఫొటోలను చూపారు. నిమ్స్ జీవన్‌దాన్ కన్వినర్ డాక్టర్ స్వర్ణలత మాట్లాడుతూ 2013లో జీవన్‌దాన్‌ను ప్రారంభించామని ఇప్పటివరకూ 100 మంది డోనర్ల ద్వారా అవయవాలు సేకరించి ఎంతో మందికి ప్రాణదానం చేసినట్లు తెలిపారు. ఈ సంస్థలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 32 ఆస్పత్రులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయని చెప్పారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జీవన్‌దాన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. అవయవదానంపై ప్రజల్లో మరింతగా అవగాహన రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సందర్భంగా అవయవదానం చేసిన వారి కుటుంబసభ్యులకు జ్ఞాపికలు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి చైర్మన్ పి.వి.ఎస్ రాజు, ఎండీ మల్లిఖార్జున్, ఈడీ పూర్ణచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.