
నా నిర్ణయం సోమవారం వెల్లడిస్తా..
సాక్షి,సిటీబ్యూరో: ‘కాంగ్రెస్ పార్టీని వీడాలనుకోవటం లేదు. పార్టీని నడపటం చేతకాని నాయకులే నాకు పొగపెడుతున్నారు. నేను పనిచేయటం లేదంటున్న నాయకులే నేరుగా పనిచేసి పార్టీని గెలిపించవచ్చు కదా... టీఆర్‌ఎస్ నుంచి నాకు ఆహ్వానం వచ్చిన విషయం వాస్తవమే అయినా నా నిర్ణయాన్ని సోమవారం ప్రకటిస్తా’ అని మాజీ మంత్రి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ స్పష్టం చేశారు. గురువారం ఉదయం తన నివాసంలో తన అనుచరులు, మాజీ కార్పొరేటర్లతో సమావేశమైన సందర్భంగా ఏఐసీసీ కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్, పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలతో ఫోన్లో మాట్లాడిన నాగేందర్.. పార్టీని వీడాలను కోవటం లేదని, ఇక పార్టీ కార్యకమాలను వేగిరం చేస్తానని చెప్పారు.
ఈ రోజు సాయంత్రం ‘సాక్షి’ ప్రతినిధితో ఫోన్‌లో మాట్లాడిన ఆయన తుది నిర్ణయాన్ని సోమవారం ప్రకటిస్తానని పేర్కొన్నారు. పార్టీని నడిపించే సత్తా లేని నాయకులు తనను పొమ్మనలేక పొగబెడుతున్నారని చెప్పారు. పీసీసీ నాయకత్వం తీరు చూస్తుంటే పార్టీ కోలుకునే పరిస్థితి కనిపించటం లేదని అన్నారు. శుక్రవారం నియోకజవర్గ కార్పొరేటర్లు, ముఖ్యులతో సమావేశం అవుతున్నానని, ఏ నిర్ణయమైనా సోమవారం ప్రకటిస్తానని చెప్పారు.