మార్పు లేకపోతే దుకాణం మూసివేత
అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాల్సిందే
జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆదేశం
సిటీబ్యూరో: దుకాణదారులు, వ్యాపారులు రోడ్లపై చెత్త వేస్తే జీహెచ్‌ఎంసీ నిబంధనల మేరకు భారీ జరిమానాలు విధించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. రెండుసార్లు జరిమానాల విధించినా మార్పు రాకపోతే దుకాణాలను మూసివేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణపై శనివారం రాత్రి సహాయ వైద్యాధికారులతో (ఏఎంఓహెచ్‌లతో) ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేకుంటే సహించేది లేదని హెచ్చరించారు. ఏఎంఓహెచ్‌లు ఉదయం ఆరు గంటలకల్లా తప్పనిసరిగా క్షేత్ర స్థాయి విధుల్లో ఉండాల్సిందేనన్నారు. లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. క్షేత్ర స్థాయి తనిఖీలకు వెళ్లినవారు అక్కడి ఫొటోలను తనకు సెల్‌ఫోన్ ద్వారా పంపించాలని... 7 గంటలకు పారిశుద్ధ్య సిబ్బంది హాజరు వివరాలను ఎస్సెమ్మెస్ ద్వారా ఇవ్వాలని ఆదేశించారు. మధ్యాహ్నం ఒంటిగంటకు అప్పటివరకు తొలగించిన మొత్తం చెత్త వివరాలు, హాజరైన సిబ్బంది సమాచారం పంపాలన్నారు. రహదారులపై ఎట్టి పరిస్థితుల్లోనూ చెత్తాచెదారాలు కనిపించకూడదన్నారు.
ఒకవేళ చెత్త కనిపిస్తే సంబంధిత శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, సూపర్‌వైజర్లు, శానిటరీ జవాన్లను బాధ్యులుగా చేయాలన్నారు. ఈ విషయాన్ని వారికి స్పష్టం చేయాలని సూచించారు. నిత్యం చెత్త ఉండే ప్రాంతాలను గుర్తించి... అక్కడ యుద ్ధప్రాతిపదికన పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. మార్కెట్ యార్డులు.. దుకాణాలు ఉండే ప్రాంతాల్లో దుకాణదారులుసొంతంగా చెత్తడబ్బాలు ఏర్పాటు చేసుకొని వాటిల్లోనే చెత్తవేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పారిశుద్ధ్య సిబ్బంది కనీసం ఏడు గంటల పాటు విధుల్లో ఉండేలా ఏఎంఓహెచ్‌లు పర్యవేక్షించాలని సూచించారు. రహదారుల వెంబడి తినుబండారాలు విక్రయించేవారు రోడ్లపై చెత్త వేయకుండా చూడాలని, పరిశుభ్రత పాటించేలా వారికి అవగాహన కల్పించాలని స్పెషలాఫీసర్ ఆదేశించారు.
తనిఖీలకు ప్రత్యేక బృందాలు..
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో పారిశుద్ధ్యానికి ఎంతో ప్రాధాన్యం ఉందని సోమేశ్‌కుమార్ చెప్పారు. పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణను ఆకస్మికంగా తనిఖీలు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఒక్కో జోన్‌కు కనీసం ఐదు బృందాలు ఏర్పాటు చేయడంతో పాటు తాను కూడా తనిఖీలు నిర్వహిస్తానన్నారు. జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు ఉదయం 6 గంటల నుంచే తనిఖీలు చేపడతారని తెలిపారు. భవన నిర్మాణ సామగ్రిని ఎవరూ రోడ్లపై వేయకుండా చూడాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో అడిషనల్ కమిషనర్ (ఆరోగ్యం-పారిశుద్ధ్యం) రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్లపై చెత్త వేస్తే భారీ జరిమానా
Published Sat, Feb 28 2015 11:47 PM | Last Updated on Sat, Sep 2 2017 10:05 PM
Advertisement
Advertisement