నిమజ్జనానికి దారేది | immersed in of Ganesh idols, he works out | Sakshi
Sakshi News home page

నిమజ్జనానికి దారేది

Published Sat, Aug 29 2015 12:52 AM | Last Updated on Fri, Aug 3 2018 2:57 PM

నిమజ్జనానికి దారేది - Sakshi

నిమజ్జనానికి దారేది

గణేశునివిగ్రహాల నిమజ్జనం విషయం ప్రస్తుతం గేటర్‌లో చర్చనీయాంశంగా మారింది. వినాయక చవితి నెల రోజులు కూడా....

వినాయక విగ్రహాల నిమజ్జనంపై తర్జనభర్జన
బెంగళూరు పద్ధతులు పరిశీలించిన అధికారులు
నగరంలో సాధ్యాసాధ్యాలపై అధ్యయనం

 
సిటీబ్యూరో: గణేశునివిగ్రహాల నిమజ్జనం విషయం ప్రస్తుతం గేటర్‌లో చర్చనీయాంశంగా మారింది. వినాయక చవితి నెల రోజులు కూడా లేదు. ఇప్పటి నుంచే నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాల్సి ఉంది. మరోవైపు హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయవద్దంటూ గతంలో తామిచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై హైకోర్టు ఇటీవల ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సాగర్ జలాల కాలుష్యానికి గల కారణాల్లో విగ్రహాల నిమజ్జనం కూడా ఒకటని ప్రభుత్వం గుర్తించింది. సాగర్ ప్రక్షాళనతో పాటు భవిష్యత్‌లో ఇందిరా పార్కులో నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని గత ఏడాది ప్రకటించింది. ఇంతవరకూ దానిపై ఎలాంటి కార్యాచరణ లేదు.

ఈ నేపథ్యంలో ఏం చేయాలో అధికారులకు పాలుపోవడం లేదు. అంతేకాదు.. బెంగళూరు తరహాలో సాగర్‌లో ఒక మూలన నిమజ్జనానికి వీలవుతుందేమో చూడాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. దీంతో ముగ్గురు అధికారుల బృందం ఇటీవల బెంగళూరును సందర్శించి వచ్చింది. అక్కడి నిమజ్జనం తీరుతెన్నులను, చెరువులను వారు పరిశీలించారు. అక్కడి పద్ధతులు ఇక్కడ అమలు చేయగలరో లేదో చెప్పగలిగే పరిస్థితిలో మాత్రం లేరు. ఎందుకంటే నగరంలో నిమజ్జనం వివిధ విభాగాలతో ముడిపడి ఉంది. సాగర్ నిర్వహణ, నిమజ్జనానంతరం వ్యర్థాల తరలింపు తదితర అంశాలు హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్నాయి. విగ్రహాల నిమజ్జనానికి క్రేన్ల ఏర్పాటు వంటివి నీటి పారుదల శాఖ చూస్తోంది. క్రేన్లకు అవసరమైన వేదికలు, సాఫీ ప్రయాణానికి రహదారుల నిర్వహణ పనులను జీహెచ్‌ఎంసీ చూస్తోంది.
 
విగ్రహాల ఎత్తే సమస్య
 బెంగళూరులో విగ్రహాల ఎత్తు తక్కువ. దీంతో చెరువుల్లోనే నిమజ్జనం చేస్తున్నారు. అక్కడ గరిష్టంగా 8 అడుగులకు మించి విగ్రహాలు ఉండవు. ఇక్కడ  వాటి ఎత్తుకు సంబంధించి ఎవరు నిర్ణయం తీసుకోవాలో స్పష్టత లేదు. బెంగళూరులో నిమజ్జనానికి చెరువుల ఒడ్డున ప్రత్యేకంగా కొలనులు నిర్మించారు. అక్కడ దాదాపు 40 చెరువుల వద్ద ఇలాంటివి ఉన్నాయి. నిమజ్జనానికి చెరువు నీటిని కొలనులోకి మోటార్ల ద్వారా పంపింగ్ చేస్తారు. అంతే కాదు. చెరువులోకి మురుగునీరు చేరకుండా ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. నిమజ్జనం అనంతరం కొలను నీటిని ప్రత్యేక నాలాల ద్వారా వెలుపలికి పంపిస్తారు. ఈ చర్యలతో అక్కడ జలాలు కలుషితం కావడం లేదు. దాదాపు దశాబ్ద కాలంగా ఈ పద్ధతిని అమలు చేస్తున్నారు.

 ఇక్కడ ఇలా..
 జీహెచ్‌ఎంసీ పరిధిలో 169 చెరువులు ఉన్నాయి. వీటిలో దాదాపు 40 చెరువుల వద్ద నిమజ్జనానికి ఏర్పాట్లు చేయవచ్చునని అధికారుల అంచనా. ప్రస్తుతం సరూర్‌నగర్, కాప్రా చెరువుల్లో నిమజ్జనాలు చేస్తున్నారు. బెంగళూరు తరహాలో కొలనులు నిర్మించినా, విగ్రహాల ఎత్తు తగ్గనిదే ప్రయోజనం ఉండదని భావిస్తున్నారు. నిర్ణీత విస్తీర్ణంలో నిర్మించే కొలనులో తక్కువ ఎత్తుంటేనే నిమజ్జనం సాధ్యమవుతుంది. గ్రేటర్‌లో విగ్రహాలు 20 నుంచి 60 అడుగుల వరకు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో బెంగళూరు తరహాలోనగరంలోని వివిధ చెరువుల వద్ద నిమజ్జనానికి వీలవుతుందో లేదో అధ్యయనం చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఇవే అంశాలను అధికారులు ఇటీవల హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పొందుపరచినట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో బెంగళూరులోనూ పెద్ద విగ్రహాలుండేవని... అక్కడ కూడా కోర్టు ఆదేశాల నేపథ్యంలో దాదాపు దశాబ్ద కాలంగా ఎత్తు తగ్గించారని అధికారుల దృష్టికి వచ్చినట్లు తెలిసింది.
 
బెంగళూరులో అల్సూరు, శాంకే చెరువుల వద్ద ఎక్కువ విగ్రహాలు నిమజ్జనం చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. వీటిని ఎప్పటికప్పుడు కొలనుల నుంచి బయటకు తొలగిస్తారు. అల్సూరు చెరువు వద్ద విగ్రహాల తొలగింపు పనులకు 60 మంది కార్మికులు విధుల్లో ఉంటారు. ఓ వైపు నుంచి విగ్రహాలు చెరువులో పడుతుంటాయి. మరోవైపు నుంచి వాటిని తొలగిస్తుంటారు. అక్కడ 13 అడుగుల లోతుతో కొలను నిర్మించారు. నాలుగు వైపుల నుంచీ విగ్రహాలు నిమజ్జనం చేయవచ్చు. హైదరాబాద్ తరహాలో ఒక్కరోజేకాకుండా పండగ తర్వాత ప్రతిరోజూ అన్ని చెరువుల్లో నిమజ్జనాలు చేస్తుంటారు. సాధారణంగా  ఐదు, ఏడు, తొమ్మిది వంటి బేసి సంఖ్యల రోజుల్లో ఎక్కువగా జరుగుతుంటాయి. ఎక్కువ ఎత్తున్న విగ్రహాలు లేనందువల్ల అల్సూరు చెరువు వద్ద కేవలం రెండు క్రేన్లతోనే నిమజ్జనం సాఫీగా సాగుతున్నట్లు అధికారులు గుర్తించారు. మన నగరంలో చివరి రోజున హుస్సేన్‌సాగర్ వద్ద దాదాపు 50 క్రేన్లు 50 గంటల పాటు పని చేస్తుండటం తెలిసిందే.
 
 ఈసారికి ఇంతే..

 వివిధ కారణాల నేపథ్యంలో ఈ ఏడాది ఎప్పటిలాగే హుస్సేన్       సాగర్‌లో నిమజ్జనాలు కొనసాగనున్నాయి. చెరువుల వద్ద ప్రత్యేక కొలనుల ఏర్పాటుకు సంబంధించి అధ్యయనం తర్వాతే నిర్ణయం తీసుకుంటారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement